ఏపీ రాజకీయాలలో ప్రధాన పార్టీలు మూడు కూడా వారి వారి వ్యూహాలతో జోరుగా రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. అధికార పార్టీ ఓ వైపు సంక్షేమ పథకాలని నమ్ముకొని మరో వైపు కులాల ప్రాతిపాదికగా ఓటు బ్యాంకుని పెంచుకునే కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా బీసీ కులాల ఓటు బ్యాంకుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికార పార్టీ వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలు, మీటింగ్స్ చూస్తూ ఉంటే అర్ధమవుతుంది. కాపులు కలిసొచ్చే అవకాశం లేదని డిసైడ్ అయిన జగన్ టీడీపీ పార్టీకి బలంగా ఉన్న బీసీ కులాల ఓటు బ్యాంకుని తనవైపుకి తిప్పుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో సంక్షేమం మాటున బారీ ఎత్తున తాయిలాలు ఆ కులాల వారీకి కేటాయిస్తున్నారు.
మరో వైపు ఏపీలో ప్రభుత్వంలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ సంక్షేమ పథకాలని ప్రజలకి చేరువ చేయడంలో బలంగా పని చేస్తుంది. ఇప్పుడు అలాంటి వ్యవస్థని బూత్ లెవల్ లో పార్టీ కోసం పనిచేసే వాలంటీర్స్ ని ఏర్పాటు చేసే దిశగా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. 50 కుటుంబాలకి ఒకరు చొప్పున బూత్ లెవల్ కన్వినర్ లని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. వీరు వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ఆ కుటుంబాలకి చెప్పి ఆ కుటుంబాల నుంచి మెజారిటీ ఓట్లు వైసీపీకి పడేలా ప్రభావితం చేయడమే పని. దీనికోసం అవసరం అయితే వారికి ప్రత్యేకంగా వేతనాలు కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఇలా బూత్ లెవల్ క్యాడర్ ని బలంగా ఏర్పాటు చేయడం ద్వారా వారి ద్వారా ఓటర్లని ఆకర్షించవచ్చని వైసీపీ అధిష్టానం భావిస్తుంది.
ఇదిలా ఉంటే ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తన ప్రజాయాత్రకి కావాల్సిన ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు. తాజాగా ఈ వాహనానికి వారాహి అని పేరు పెడుతూ త్వరలోనే బస్సు యాత్ర కోసం రోడ్డుపైకి రాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఒక వేళ పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ద్వారా రోడ్డు మీదకి వచ్చి ఈ ఏడాది మొత్తం ప్రజలలో ఉంటే కచ్చితంగా రానున్న ఎన్నికలలో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తారు. అయితే తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకి వెళ్తారా లేక బీజేపీతో కలిసి వెళ్తారా అనేది ఇప్పుడే చెప్పలేని విషయం.
అయితే ముందుగా అన్ని నియోజకవర్గాలకి బలమైన నాయకులని సిద్ధం చేసుకునే పనిని ఈ బస్సుయాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ చేయబోతున్నారని అర్ధమవుతుంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ నుంచి కాపు నాయకులతో పాటు మరికొంత మంది బలమైన లీడర్స్ జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారనే మాట వినిపిస్తుంది. ఇక బస్సుయాత్ర జరగబోతుందని సిగ్నల్ ఇవ్వడం ద్వారా వారంతా జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధం అవుతున్నారు. మరో వైపు టీడీపీ కూడా ప్రభుత్వం వ్యతిరేకతని తమకి అనుకూలంగా మార్చుకోవాలని రాజకీయ వ్యూహాలతో ముందుకి వెళ్తున్నారు. అయితే జనసేనతో కలిసి వెళ్తే మళ్ళీ టీడీపీకి అధికారం దక్కుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు కోడా చెబుతున్న మాట. అయితే అధికారంలో భాగస్వామ్యం ఇచ్చి ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ ఇస్తేనే పొత్తు అని జనసేన అంటుంది. దానికి టీడీపీ సిద్ధంగా లేదని తెలుస్తుంది.