Health Tips: చాలా మంది మధ్యాహ్నం భోజనం తిన్నాక ఓ కునుకు వేస్తుంటారు. ఆఫీసుల్లో పని చేసే వారికి నిద్రపోయే చాన్స్ ఉండదు. ఇక రాత్రి పూట విధులు నిర్వర్తించే వారికి రోజూ మధ్యాహ్నం ఓ కునుకు వేయనిదే కంటి నిండా నిద్రపోయినట్లు ఉండదు. ఈ క్రమంలో చాలా రంగాల్లోని వ్యక్తులు మధ్యాహ్నం పూట భోజనం తిన్న తరువాత కాసేపు పడక వేస్తుంటారు.
మధ్యాహ్నం నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అసలు మధ్యాహ్నం భోజనం తిన్నాక ఎందుకు నిద్ర వస్తుందో తెలుసుకోవాలి. సాధారణంగా అన్నంలోని గ్లూకోజ్ రక్తంలో వేగంగా కలవడం వల్ల మధ్యాహ్నం పూట నిద్ర మత్తు ఆవహిస్తుందని వైద్యులు చెబుతారు. లంచ్‌గా అన్నం తినడం వల్ల మెలటోనిన్, సెరటోనిన్ లాంటి ప్రశాంతతను కలిగించే హార్మోన్లు విరివిగా విడుదలవుతాయట.
ఈ క్రమంలో దేహానికి విశ్రాంతి కావాలని అనిపిస్తుంది. అందుకే ఇవి మన బాడీలో ప్రశాంతతను, రెస్ట్‌ను, మత్తును కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో భోజనం తిన్న తరువాత కాసేపటికే నిద్ర రావడం మొదలవుతుంది. సాధారణంగా మధ్యాహ్నం వేళలో మానవ శరీరంలో కాస్త శక్తి సన్నగిల్లుతుంది. దీనికి తోడు అన్నం కూడా తినడం వల్ల ఇక శరీరానికి నిద్ర తప్పనిసరిగా వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో అధిక ప్రోటీన్లు, విటమిన్లు కలిగిన ఆహారాన్ని తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Health Tips: నిద్ర రాకూడదంటే ఇలా చేయాలి..
విటమిన్లు, ప్రోటీన్లు కలిగిన ఫుడ్ ను తీసుకోవడం ద్వారా డోపమైన్, ఎపినెఫ్రిన్ లాంటి చురుకైన రసాయనాలు మన మెదడు వేగాన్ని పెంచుతాయని చెబుతున్నారు. దాంతోపాటు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయని స్పష్టం చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో అన్నం తినాల్సి వస్తే సాధారణ బియ్యానికి బదులుగా బాస్మతి రైస్ వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. బాస్మతి రైస్‌లో ఉండే గ్లూకోజ్ త్వరగా రక్తంలో కలవదని సూచిస్తున్నారు. ఇందువల్ల మధ్యాహ్నం నిద్ర వచ్చే సమస్యను పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు. దాంతోపాటు మధ్యాహ్నం పూట కాస్త అన్నం తక్కువ తినాలని సూచిస్తున్నారు.