Shalini: సినిమాల్లో బాలనటులకు మంచి ప్రత్యేకత ఉంటుంది. ఆ పాత్రలకు తక్కువ నిడివి ఉన్నా ఆడియెన్స్ లో అటెన్షన్ సంపాదించేందుకు ఎక్కువ అవకాశం లభిస్తుంది. చిన్నతనంలో చిత్రసీమలోకి అడుగుపెట్టి పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. కమల్ హాసన్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు బాల్యంలోనే నటనారంగంలోకి అడుగుపెట్టి తమ ప్రతిభ ఏంటో చూపించారు. ఆ తర్వాత కాలంలో సూపర్ స్టార్ లుగా ఎదిగారు.
అభిమానులతో టచ్‌లోకి..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని కూడా ఈ కోవలోకే వస్తారు. మూడేళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది షాలిని. బాలనటిగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె.. ‘సఖి’ మూవీతో తమిళంలోపాటు తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. అయితే అజిత్ ను పెళ్లాడిన తర్వాత ఆమె కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే ఉద్దేశంతో సినిమాలకు దూరమయ్యారు. అలాగే సోషల్ మీడియాకూ ఆమె దూరంగా ఉన్నారు.
ఆమె ఇన్‌స్టా హ్యాండిల్ ఇదే..
కాగా, తల అజిత్ అభిమానుల నుంచి ఇప్పుడో స్పెషల్ అప్ డేట్ వచ్చింది. ఇన్నాళ్లూ ఫ్యామిలీ లైఫ్ తో అందరికీ దూరంగా ఉన్న షాలిని.. త్వరలో తన ఫాలోవర్లు, ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు నెట్టింట్లోకి ఎంట్రీ ఇచ్చేశౄరు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె జాయిన్ అయ్యారు. షాలిని ఇన్‌స్టా హ్యాండిల్ @shaliniajithkumar2022. నెట్టింట చురుగ్గా ఉండే షామిలీ (షాలిని సోదరి) తన సోదరిని సోషల్ మీడియాలోకి స్వాగతం పలికారు. తక్కువ సమయంలోనే షాలినీకి ఫాలోవర్లు భారీగా వచ్చి చేరారు.
అప్పుడే అంతమంది ఫాలోవర్సా?
తాజాగా అభిమానులతో టచ్‌లోకి వచ్చిన షాలిని.. పనిలో పనిగా భర్తతో కలసి దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. అయితే ఇవి కాస్తా వైరల్‌గా మారాయి. అలా సోషల్ మీడియాలోకి వచ్చిందో లేదో అప్పుడే షాలినీని 50 వేల మంది ఫాలో అవుతుండటం విశేషం. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.