Team India: న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్‌కి అవకాశం దక్కలేదు. రెండు మ్యాచుల్లోనూ రిషబ్ పంత్‌కి అవకాశం ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్.. సంజూ శాంసన్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టింది. ఎప్పటిలాగే రిషబ్ పంత్ మరోసారి ఫెయిల్ అయ్యి, అభిమానులను నిరాశపరిచాడు.
ఇక కివీస్‌తో మొదటి వన్డేలో రిషబ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్‌కి కూడా తుది జట్టులో చోటు దక్కింది. రిషబ్ పంత్ 23 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి నిరాశపరచగా.. సంజూ శాంసన్ 38 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ఐదో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు సంజూ శాంసన్.
అయితే రెండో వన్డేలో సంజూ శాంసన్‌పై వేటు వేసింది టీమిండియా. ఆల్‌రౌండర్ దీపక్ హుడాకి తుదిజట్టులో చోటు దక్కింది. హుడాని జట్టులోకి తీసుకురావాలనుకుంటే పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ని తప్పించొచ్చు. కానీ శాంసన్‌ను తప్పించడంపై సోషల్‌మీడియాతో తీవ్ర విమర్శలొస్తున్నాయి.
అందరూ నార్త్ ఇండియా ఆటగాళ్లేనా..
శాంసన్‌ను కేవలం ఒక్క మ్యాచ్‌కే పరిమితం చేశారా అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్‌పై ఎందుకంత వివక్ష చూపిస్తున్నారు.. సౌత్ ప్లేయర్ అనేనా అంటూ మండిపడుతున్నారు. ‘సంజూ శాంసన్.. దక్షిణ భారతదేశానికి చెందిన వాడు కావడం వల్లే అతనికి తుదిజట్టులో చోటు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారు. శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్, ఉమ్రాన్ మాలిక్… ఇలా అందరూ నార్త్ ఇండియాకి చెందినవాళ్లే. సంజూ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన దీపక్ హుడా కూడా నార్త్ ఇండియనే” అంటూ ధ్వజమెత్తారు. ‘ఇంతకముందు త్రిబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా కరణ్ నాయర్.. ఆస్ట్రేలియాలో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చిన టి.నటరాజన్.. ఆ తర్వాత కనిపించకపోవడానికి కూడా ఈ వివక్షే కారణమని’ కొంతమంది అభిమానులు పేర్కొన్నారు.
Team India:
సంజూను తుది జట్టులో తీసుకోకపోవడంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శిఖర్ ధావన్ క్లారిటీ ఇచ్చేశాడు. ‘‘మాకు ఆరో బౌలర్ ఆప్షన్ ఉంటే బాగుంటుందని భావించాం. అందుకే సంజూ శాంసన్ బదులు దీపక్ హుడాను తీసుకొన్నాం. అలాగే చాహర్ వికెట్‌కు రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగల సమర్థుడు. అందుకే చాహర్‌ను తుది జట్టులోకి ఎంపిక చేశాం. అయితే మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. అన్నీ మన నియంత్రణలో ఉండవు’ అని పేర్కొన్నాడు.