ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు టాలీవుడ్ లో వివాదం రాజుకుంది. సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలకి ప్రాధాన్యత ఇచ్చి వారసుడు సినిమాని వాయిదా వేయాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక లేఖ విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ సినిమా చుట్టూ సినిమా రాజకీయాలు నడుస్తున్నాయి. తమిళ్ దర్శకులు, అలాగే విజయ్ ఫ్యాన్స్ వారసుడు రిలీజ్ వాయిదా వేస్తే తమిళనాడులో తెలుగు సినిమాలు రిలీజ్ అడ్డుకుంటాం అని అంటున్నారు. ఇక వారసుడు రిలీజ్ కి అడ్డుకునే రైట్స్ ఎవరికి లేవంటూ కొందరు తెలుగు అగ్ర నిర్మాతలు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే దిల్ రాజు మాత్రం ఈ వివాదంపై ఇప్పటి వరకు స్పందించలేదు. అలాగే రిలీజ్ వాయిదా వేస్తానని కూడా చెప్పలేదు. ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు. అందులో భాగంగా వారసుడు సినిమా రిలీజ్ విషయంలో వివాదంపై కూడా స్పందించారు. ఈ కాంట్రవర్సీ వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అన్ని విషయాలు తనకి తెలుసని అన్నారు.
కావాలనే తన సినిమాని ఇలా వివాదంలోకి లాగారని కూడా కామెంట్స్ చేశారు. అలాగే ఇండస్ట్రీ ఏ ఒక్కరి నిర్మాత చేతిలో ఉండదని, అలాంటిది శాసించే శక్తి ఎక్కడ ఉంటుందని అన్నారు. సినిమా థియేటర్స్ అన్ని కేవలం నలుగురు నిర్మాతల చేతిలో ఉందనే విమర్శలపై కూడా దిల్ రాజు స్పందించారు. కేవలం రాష్ట్రంలో 37 థియేటర్స్ మాత్రమే తన చేతిలో ఉన్నాయని, వాటిని పెట్టుకొని నేను ఎలా శాసించగలను అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.