IT Raids : మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ మెరుపు దాడులు చేసి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మల్లారెడ్డి కుమారులు, అల్లుడి ఇళ్లలో ఈ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారనే ఆరోపణలతో ఐటీ శాఖ ఈ దాడులకు పూనుకుంది. నేటి తెల్లవారుజాము నుంచే అధికారుల బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 50 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఇల్లు, కళాశాలలు అన్నింటినీ ఐటీ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి కుటుంబ సభ్యులందరి దగ్గర నుంచి ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి ఆస్తుల వివరాలు హైలైట్ అవుతున్నాయి. మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని పలుప్రాంతాలలో అధికారులు పెద్ద ఎత్తున ఆస్తులను అధికారులు గుర్తించినట్లు సమాచారం. మల్లారెడ్డి ఆస్తుల లిస్ట్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఒక యూనివర్శిటీ సహా మల్లారెడ్డి 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. రెండు మెడికల్ కాలేజీలు,మొత్తం 6కు పైగా పాఠశాలలు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు, దేవరాంజల్, షామీర్ పేట్, జవహర్ నగర్, మేడ్చల్, ఘట్కేసర్, కీసరలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
మొత్తంగా అటు ఈడీ, ఇటు ఐటీ అధికారులు టీఆర్ఎస్ కీలక నేతలే టార్గెట్‌గా ఇటీవలి కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఇక తాజాగా మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై నేడు ఐటీ అధికారులు మెరుపు దాడులు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజర్యారు. ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.