Superstar Krishna: టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ కృష్ణ 350 సినిమాలకు పైగా నటించి రికార్డు సృష్టించారు. ఆయనతో కలిసి సుమారు 105 మంది దర్శకులు పనిచేశారు. అయితే తెలుగులో రీమేక్ చిత్రాల్లో ఎక్కువ నటించిన ఘనత కూడా సూపర్‌స్టార్‌కే దక్కుతుంది. ఆయన మొత్తం 54 రీమేక్ చిత్రాల్లో నటించి రికార్డు నెలకొల్పారు. ఇందులో హిందీ రీమేక్ చిత్రాలు 17 ఉన్నాయి. ఈ జాబితాలో దాదాపుగా 60 శాతానికి పైగా విజయాలు ఉండటం మరో విశేషం.
కృష్ణ నటించిన హిందీ రీమేక్ సినిమాల విషయానికి వస్తే.. రాజ్‌కపూర్ నటించిన అనాడి చిత్రాన్ని అమాయకుడు పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. 1968 మే 10న ఈ చిత్రం విడుదలైంది. హైదరాబాద్ సాగర్ థియేటర్‌లో 48 రోజులు ప్రదర్శింపబడింది. ఈ సినిమాలో తన కంటే సీనియర్ హీరోయిన్ జమునతో తొలిసారిగా కృష్ణ నటించారు. ఈ మూవీకి అడ్డాల నారాయణరావు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత హిందీలో సక్సెస్ సాధించిన వక్త్ మూవీని భలే అబ్బాయిలు మూవీగా తెలుగులో రీమేక్ చేశారు.
నటుడు పేకేటి శివరాం తెరకెక్కించిన భలేఅబ్బాయిలు మూవీలో కృష్ణ, కృష్ణంరాజు, రామ్మోహన్ హీరోలుగా నటించారు. ఈ మూవీ 1969, మార్చి 1న విడుదలైంది. ఈ చిత్రంలో కేఆర్ విజయ హీరోయిన్‌గా నటించింది. అనంతరం హిందీలో విజయవంతంగా ప్రదర్శింపబడిన మిస్టర్ ఎక్స్ చిత్రాన్ని శభాష్ సత్యంగా తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. క్రైమ్ కథాంశంగా రూపొందిన ఈ మూవీలో కృష్ణ, రాజశ్రీ నటించారు.
Superstar Krishna కృష్ణ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా
అనంతరం హిందీలో జితేంద్ర నటించిన దోబాయ్ మూవీతో పాటు సీత అవుర్ గీత, చోర్ మచాయె షోర్, హాత్ కీ సఫాయి, ఇన్‌కార్ లాంటి హిట్ సినిమాలను కృష్ణ హీరోగా తెలుగులో తెరకెక్కించారు. ఇవన్నీ ఆయనకు మంచి పేరు సాధించి పెట్టాయి. అయితే కృష్ణ కెరీర్‌లో గూఢచారి 116 టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. రెండో సినిమా కన్నె మనసులు చేస్తుండగా ఈ మూవీ ఆఫర్ వచ్చింది. ఇది సూపర్ హిట్ కావడంతో ఏకంగా 20 సినిమాల్లో హీరోగా అవకాశాలు వచ్చాయి. ఇదే తరహాలో ఆ తర్వాతి రెండు దశాబ్దాల్లో ఏకంగా ఆరు జేమ్స్‌బాండ్ తరహా సినిమాల్లో నటించగా అప్పట్లో కృష్ణను ఆంధ్రా జేమ్స్‌బాండ్ అని పిలిచేవారు.