ఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక సంక్రాంతి బరిలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు దిల్ రాజు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. భారీ బడ్జెట్ తో ద్విభాష చిత్రంగా దీనిని తెరకెక్కించడంతో అదే స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి. విజయ్ కి తెలుగునాట పెద్దగా మార్కెట్ లేకపోయిన వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబోలో వస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా బజ్ ఉంటుంది. ఈ సినిమాకి పోటీగా సంక్రాంతి బరిలో వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
వాటితో పాటు అఖిల్ ఏజెంట్ మూవీ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు దిల్ రాజు వారసుడు సినిమాని సంక్రాంతి పోటీ నుంచి వెనక్కి తప్పించేందుకు ప్రయత్నం జరుగుతుంది. పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో డబ్బింగ్ సినిమాలని వాయిదా వేసుకోవాలని, మన భాషకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని గతంలో దిల్ రాజు ఓఇంటర్వ్యూలో కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. మూడు పెద్ద తెలుగు సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా డబ్బింగ్ సినిమా అయిన వారసుడిని ఆ సమయంలో ఎలా రిలీజ్ చేస్తారంటూ నందమూరి, మెగా ఫ్యాన్స్ దిల్ రాజుని ప్రశ్నిస్తున్నారు.
మరో వైపు నిర్మాతల మండలికి కొంత మంది డిస్టిబ్యూటర్స్ వారసుడు సినిమాని సంక్రాంతి బరిలో నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. దిల్ రాజు తాను గతంలో అన్న మాటలకి కట్టుబడి ఉండాలంటే మాత్రం కచ్చితంగా వారసుడిని వాయిదా వేయాల్సిన అవసరం వచ్చింది. కాదని సంక్రాంతికి రిలీజ్ చేస్తానని, వారసుడు తెలుగు సినిమా అని చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం గతంలో సినీ కార్మికుల బంద్ సందర్భంగా వారసుడు సినిమా షూటింగ్ ఆపకుండా ఎందుకు చేశారనే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇలా ఎటు మాట్లాడలేకుండా దిల్ రాజుని నిర్మాతలు అందరూ కలిసి కార్నర్ చేశారని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో వారసుడు రిలీజ్ వాయిదా వేయక తప్పని పరిస్థితి దిల్ రాజుకి వచ్చిందనే మాట వినిపిస్తుంది.