పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. వరుసగా కొత్త కొత్త అంశాలని తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. ప్రజలలో కూడా తనపై నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం జనసేన బలం కూడా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఇదే స్పీడ్ తో టీడీపీని బీట్ చేస్తూ ముందుకి వెళ్తే వైసీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన ప్రజలలోకి వెళ్తుందని, దాని ద్వారా ప్రజాబలంతో అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయ విశ్లేషకుల మాట. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఓ వైపు చేస్తూ మరో వైపు రాజకీయాలు నడుపుతున్నారు.
ఇక ఈ మూవీ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్, తమిళ్ హిట్ మూవీ రీమేక్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాకి ఒకే చెప్పాడు. అయితే ప్రస్తుతం రాజకీయాలలో ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా హరిహర వీరమల్లు కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు. ఇక ఎన్నికలకి ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ నేపధ్యంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి మిగిలినవి పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. క్రిష్ దర్శకత్వంలోతెరకెక్కుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి డిసెంబర్ పూర్తవుతుంది. ఇక జనవరి నుంచి పూర్తి స్థాయి రాజకీయ కార్యాచరణతో ఎన్నికలకి సిద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది.
ఈ నేపధ్యంలోనే పవన్ హరీష్ శంకర్ తో పాటు సురేందర్ రెడ్డికి ఈ ప్రాజెక్ట్స్ ఎన్నికల తర్వాత చేద్దామని చెప్పినట్లు సమాచారం. ఎన్నికల తర్వాత పవన్ కోరుకున్నట్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఆ సినిమాలు చేసే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి అయితే సినిమాల జోలికి పవన్ ఇక వెళ్లకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే హరిహర వీరమల్లు కాకుండా మిగిలిన మూడు సినిమాలు వాయిదా పడినట్లే అనే మాట వినిపిస్తుంది.