Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉందని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా ఆసుపత్రి వైద్యులు మీడియాకు ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కృష్ణను రాత్రి మహేష్ బాబు భార్య నమ్రత ఆసుపత్రిలో చేర్చారు. మరో రెండు రోజుల పాటు తమ పర్యవేక్షణలోనే కృష్ణ ఉండాలని వైద్యులు తెలిపారు. కాంటినెంటల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గురవారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విషమ పరిస్థితుల్లో ఉన్న కృష్ణకు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నామన్నారు.
ఇప్పటి నుంచి ప్రతి గంట కూడా కీలకమేనన్నారు. గుండెపోటుతో స్పృహలో లేని స్థితిలో వైద్యులు ఆయన్ను ఆసుపత్రికి తీసుకొచ్చారని గురవారెడ్డి వెల్లడించారు. రాగానే ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందజేశామన్నారు. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్నారు. 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి గుండెపోటు నుంచి బయటపడగలిగేలా చేశామన్నారు. కృష్ణ శరీరం వైద్యానికి సహకరించే దానిని బట్టి వైద్యం ఉంటుందన్నారు. ఆయన కోలుకోవాలని అందరం ప్రార్దిద్దామని గురవారెడ్డి తెలిపారు.
24 గంటల తర్వాత మళ్లీ హెల్త్ బులిటెన్ ఇస్తామని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా.. కృష్ణ పరిస్థితి విషమం అని తెలియగానే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాసేపటి క్రితం వీకే నరేశ్ సైతం మీడియా ముందుకు వచ్చి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. అలాగే 24 గంటల తర్వాత ఆస్పత్రి నుంచి కృష్ణను డిశ్చార్జ్ చేస్తారని సైతం ఆయన చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే వైద్యులు కృష్ణ ఆరోగ్య పరిస్థితిని వివరించి షాక్ ఇచ్చారు.