Life Style: అనుమానం ఓ మాయరోగం అన్నారు పెద్దలు. ఏ బంధంలో అయినా అనుమానం ఉంటే చాలా కష్టం. రిలేషన్ ముందుకెళ్లాలంటే సందేహాలు పక్కనపెట్టేయాలి. ముఖ్యంగా వివాహ బంధంలో అనుమానాలకు తావివ్వకూడదు. సందేహాలతో సంసారపు బండి ముందుకు సాగలేదు. ఎలాంటి బంధాన్నైనా సందేహం తుంచేస్తుంది. వీటి వల్ల బలమైన బంధాలు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది.
వైవాహిక బంధంలో సందేహం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. భాగస్వామిపై అనుమానం ఏర్పడితే అది భవిష్యత్తులో తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుంది. మనస్సులో సందేహం ప్రారంభమైనప్పుడు భాగస్వామి ప్రవర్తన, అలవాట్లను నెగెటివ్ గా చూడటం మొదలవుతుంది. ఫలితంగా భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. అలాంటి సందర్భాల్లో ఈ అలవాటును తొలగించుకోవడం ద్వారా దాంపత్య జీవితాన్ని కాపాడుకోవచ్చు.
ఆలోచనలను పంచుకోవాలి
పచ్చని కాపురంలో అనుమానాలు తలెత్తకుండా ఉండాలంటే నిపుణులు చెప్పే కొన్ని చిట్కాలు, సూచనలను పాటించాల్సిందే. ఏదైనా విషయంలో అనుమానం వస్తే భాగస్వామిని ప్రశ్నించే ముందు.. దానికి సంబంధించి మీకు ఉన్న అనుమానాలు, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇవి కొన్ని సార్లు భవిష్యత్తులో సంబంధాలపై ప్రభావం చూపుతాయని గుర్తుంచుకోవాలి. మీ కోరికలు, ఆలోచనలు, అవసరాల గురించి భాగస్వామికి తెలియజేయడానికి కొంత సమయాన్ని కేటాయించాలి.
Life Style: నిజాయితీగా ఉండటం ముఖ్యం
ఏదైనా విషయంలో విభేదాలు తలెత్తినప్పుడు భాగస్వామితో మాట్లాడటం ద్వారా చాలా వరకు సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మనసు విప్పి మాట్లాడుకోవడం, దాపరికాలు లేకుండా అన్ని విషయాలు మాట్లాడుకుంటే భాగస్వామికి మీ మీద మరింత నమ్మకం ఏర్పడుతుంది. మీ భావాలు, మిమ్మల్ని ఆందోళనలకు గురి చేస్తున్న విషయాల గురించి భాగస్వామితో చర్చించడం మేలు. ఘర్షణకు బదులుగా అనుమానం కలిగించే కారణాలను ప్రస్తావించాలి. వారితో నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. అతిగా ఆలోచించడం మానేయాలి. ఆవేశంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతికూల ఆలోచనలను తగ్గించుకోవాలి.