Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా సినిమా హరిహర వీరమల్లు. పవర్ పొలిటికల్ టూర్ల నేపథ్యంలో చిత్రం షూటింగ్ లో ఆలస్యం జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఏపీలో రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. వైజాగ్ లో ప్రభుత్వం తలపెట్టిన విశాఖ గర్జన నేపథ్యంలో పవన్ టూర్ ఉద్రిక్తతలకు దారి తీసింది. అదే సమయంలో పవన్ జనవాణి కార్యక్రమం చేయాలని భావించారు. అయితే పోలీసు శాఖ అందుకు అంగీకరించలేదు. విశాఖలో పోలీసుల ఆంక్షలున్న నేపథ్యంలో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారు.
ఈ నేపథ్యంలో పవన్ జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేసుకొని తిరిగి అమరావతికి చేరుకున్నారు. తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. ఇరువురూ కలిసి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా ఊపందుకుంది. జగన్ ప్రభుత్వంపై ఇద్దరు నేతలూ మండిపడ్డారు. ఆ గొడవ సుమారు రెండు వారాల పాటు కొనసాగింది. అనంతరం మరో ఇష్యూ తెరపైకి వచ్చింది.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరావతి సమీపంలోని ఇప్పటం గ్రామంలో పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ గ్రామంపై ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్.. అక్కడ రోడ్ల విస్తరణ పేరుతో బిల్డింగులు కూలగొట్టసాగింది. ఈ క్రమంలో పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇడుపుల పాయలో కూడా హైవే వేస్తామంటూ ఆగ్రహోదగ్రుడయ్యారు పవన్. నేరుగా ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. ఇలా ఏపీలో పొలిటికల్ హీట్ నడుస్తోంది.
Pawan Kalyan: రెగ్యులర్ షూటింగ్ లో బిజీ బిజీ..
పొలిటికల్ టూర్ల నేపథ్యంలో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ ఆలస్యమవుతోందని భావించిన పవర్ స్టార్.. ఇక ఆ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కనిపించనున్నారు. అందాల తార నిధి అగర్వాల్ పవన్ సరసన నటిస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. రెగ్యులర్ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఇక విరామం లేకుండా చిత్రీకరణ పూర్తి చూసి వచ్చే ఏడాది వేసవికల్లా సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.