Viral Video: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం ఏ పని జరగాలన్నా లంచం తప్పకుండా ఉండాల్సిందే అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతలా అవినీతి మనదేశంలో నడుస్తోందంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ అత్యంత అవినీతిమయంగా మారిపోయిందనే విమర్శలున్నాయి. భూ రికార్డులు మార్పులు చేసుకోవాలన్నా, రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా లంచం అందిస్తేగానీ పనులు జరగని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఈ తరుణంలో ఒక్కోసారి ప్రజలు తిరగబడుతున్న పరిస్థితులూ గమనిస్తున్నాం. ఒకసారి తెలంగాణలో రెవెన్యూ అధికారిని పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన అందరికీ తెలిసిందే.
తాజాగా ఓ రైతును ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినందుకు ఓ ప్రజా ప్రతినిధి ఆ ఉద్యోగి చెంప చెల్లుమనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. రాజస్థాన్ లో ఈ ఘటన వెలుగు చూసింది. అక్కడి బీజేపీ ఎంపీ చంద్రప్రకాశ్ జోషి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు. రైతు ఎంపీ వద్దకు వచ్చి ఓ అధికారి తనను గోడును ఎంపీ వద్ద వెళ్లబోసుకున్నాడు. దీంతో ఎంపీకి కోసం వచ్చింది.
గత కొంత కాలంగా భూమి పట్టాలకు సంబంధించి బదలాయింపు విషయంలో సదరు ప్రభుత్వ ఉద్యోగి లంచం కోసం వేధిస్తున్నాడని రైతు తెలిపాడు. ఎంత వేడుకుంటున్నా కనికరించడం లేదని, రూ.5 వేలు ఇస్తేనే పని జరుగుతుందని ఉద్యోగి డిమాండ్ చేశాడని ఎంపీ వద్ద రైతు చెప్పాడు. దీంతో ఎంపీ హుటాహుటిన ఉద్యోగి వద్దకు వెళ్లాడు.
Viral Video: జీతం వస్తోంది కదా.. మళ్లీ లంచం ఏంటి?
ఉద్యోగిని పిలిచి మాట్లాడాడు. ఎంపీ ప్రశ్నిస్తున్న సమయంలో.. ఉద్యోగి రూ.15 వేలు లంచం అడిగినట్లు కొందరు రైతులు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే కోపోద్రిక్తుడైన ఎంపీ జోషి.. సదరు ప్రభుత్వ ఉద్యోగి చెంపపై చేయి చేసుకున్నారు. నెలా నెలా ప్రభుత్వం జీతం ఇస్తోంది కదా.. ఇంకా ఎందుకు లంచం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ. మరోసారి ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు ఎంపీ. అయితే, అందరి ముందూ ఇలా ఓ ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకోవడంపై ఎంపీ విమర్శల పాలవుతున్నారు.