Relationship: భార్య గర్భవతి అయితే ముందుగా సంతోషపడేది భర్త. అయితే సంతోషపడితే మాత్రం సరిపోదు. భార్య సుఖంగా ప్రసవించేందుకు భర్త ఆమెను ప్రేమగా, సంతోషంగా చూసుకోవాలి. భార్య ఆహారపు అలవాట్లలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆమె కోరికలను తీర్చేందుకు ప్రయత్నించాలి. ఇలా అన్ని రకాలుగా గర్భవతి అయిన భార్యకు భర్త సహకరించడం ఎంతో ముఖ్యం. భార్య గర్భం దాల్చాక ఎక్కువ సమయం భర్త తనతోనే ఉండాలని కోరుకుంటుంది. భర్త కూడా తన భార్యతో ఎక్కువ సమయం కేటాయిస్తే తల్లికి, పుట్టబోయే బిడ్డకు మంచిది.
ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు భార్య చుట్టూ ఉండే వాతావరణ ప్రభావం ఆమె కడుపులో పెరుగుతున్న శిశువుపై పడుతుంది. జన్మించిన తర్వాత కొంతమంది శిశువులు ఉల్లాసంగా, చురుగ్గా ఉండటానికి.. మరికొందరు చిరాకుగా, కోపంగా ఉండటానికి ఇది కారణమని వైద్యులు వెల్లడిస్తున్నారు. అందుకే గర్భవతిగా ఉన్న సమయంలో భార్యను ఉల్లాసంగా ఉంచేందుకు భర్తలు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వైద్యులు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలి.
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆమె డైట్ మెయింటెన్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పోషకాహారం ఎక్కువగా ఇవ్వాలి. ఐరన్, కాల్షియం, విటమిన్-డి, విటమిన్-ఎ, విటమిన్-సి లభించే ఆహారాలను రోజువారీ ఇచ్చేలా చూడాలి. ఒక్కోసారి వైద్యుల సలహా మేరకు విటమిన్-బి12, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, ఒమేగా-3 సప్లిమెంట్లు తీసుకోవాల్సి రావచ్చు. అంతేకాకుండా భార్య ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం కూడా బాధ్యతగా భావించాలి.
Relationship: టెన్షన్ పెట్టే విషయాలు చెప్పరాదు
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె సంతోషంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని భర్త గుర్తించుకోవాలి. అందుకే ఆమెను భయపెట్టే, టెన్షన్ పెట్టే విషయాలు చెప్పకూడదు. ఈ విషయంలో భర్త జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఒత్తిడి కారణంగా మహిళల్లో బీపీ పెరుగుతుంది. దాని కారణంగా గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక ఒత్తిడికి లోనయ్యే మహిళలలో పిల్లల రోగనిరోధక శక్తి ఇతర పిల్లల కంటే బలహీనంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం పిల్లల స్వభావాన్ని కూడా ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.