T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో బుధవారం రసవత్తర మ్యాచ్ జరిగింది. బంగ్లాదేశ్, టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్ నువ్వా నేనా అంటూ సాగింది. అయితే వరుణుడు ఆట మధ్యలో అంతరాయం కలిగించాడు. అప్పటికీ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లాదేశ్ ముందంజలో ఉంది. ఒకవేళ వర్షం వల్ల ఆ సమయంలో మ్యాచ్ ఆగిపోతే బంగ్లాదేశ్ విజేతగా నిలిచేది. అయితే వర్షం కొద్దిసేపటి తర్వాత నిలిచిపోవడంతో బంగ్లాదేశ్ టార్గెట్‌ను అంపైర్లు రివైజ్ చేశారు.
నిజానికి ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 20 ఓవర్లలో 185 పరుగులు చేయాలి. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. వర్షం ఆగిపోయాక బంగ్లాదేశ్ టార్గెట్ 16 ఓవర్లలో 151 పరుగులుగా మారింది. అప్పటికి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు ఓపెనర్ లిట్టన్ దాస్ వెన్నెముకగా నిలిచాడు. వర్షం ఆగిపోయిన తర్వాత ఆట ప్రారంభమైన కాసేపటికే లిట్టన్ దాస్ రనౌట్ రూపంలో అవుటయ్యడు.
దాస్ వికెట్ మ్యాచ్‌లో కీలక మలుపుగా మారింది. అటు పిచ్ తడిగా ఉండటంతో పరుగులు రావడం బంగ్లాదేశ్‌కు కష్టంగా మారింది. దీంతో ఒత్తిడి పెరిగి ఆ జట్టు ఆటగాళ్లు వికెట్లు పారేసుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా వరుసగా వికెట్లు తీయడంతో చివరి ఓవర్ ఉత్కంఠభరితంగా మారింది. అర్ష్‌దీప్ వేసిన చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరమయ్యాయి. కానీ 14 పరుగులే వచ్చాయి. దీంతో 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.
T20 World Cup: భారత్‌ను వణికించిన దాస్
ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందని చాలా మంది భావించారు. దానికి కారణం బంగ్లాదేశ్ ఓపెనర్ లిట్టన్ దాస్. అతడు 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 60 పరుగులు చేశాడు. నిజానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతడికి ఇస్తే బాగుండేది. కానీ టీమిండియాను ఆదుకున్న విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్.. ఈ టోర్నీ గురించి తాము పెద్దగా ఆలోచించ లేదని.. ప్రశాంతంగా ఉంటూ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటంపైనే ఫోకస్ పెట్టామని.. అందుకే టీమిండియాను ఓడించినంత పని చేశామని అన్నాడు.