టాలీవుడ్ లో టాలెంటెడ్ నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి సత్యదేవ్. క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కో అడుగు వేసుకుంటూ జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా ప్రయాణం మొదలు పెట్టిన సత్యదేవ్ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలతో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కరెక్ట్ గా వినియోగించుకొని స్టార్ నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఏకంగా గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి ప్రతినాయకుడుగా కనిపించి మెప్పించాడు. ఈ సినిమాలో చిరంజీవితో సమానమైన పాత్రని సత్యదేవ్ పోషించాడు. అదంతా కేవలం చిరంజీవి దృష్టిలో పడటమే అని చెప్పాలి. బ్లఫ్ మాస్టర్ సినిమాలో సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర అవకాశాన్ని ఇచ్చారు.
దీనిని సత్యదేవ్ కూడా కరెక్ట్ గా ఉపయోగించుకొని సక్సెస్ అయ్యాడు. సినిమాలో చిరంజీవి కంటే సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ కి ఎక్కువ మార్కులు పడ్డాయంటే ఏ స్థాయిలో మెప్పించాడో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు సత్యదేవ్ చేతిలో ఏకంగా మూడు సినిమాల వరకు హీరోగా ఉన్నాయి.కొత్త దర్శకుడితో కన్నడ హీరో డాలీ ధనుంజయ్ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ ఒకటి కాగా తిమ్మరుసు దర్శకుడు శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఫుల్ బాటిల్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో మెర్క్యురీ సూరి అనే పాత్రలో సత్యదేవ్ కనిపిస్తున్నాడు.
ఈ పాత్రకి సంబందించిన ఫస్ట్ లుక్ ని తాజాగా రివీల్ చేశారు. ఇంటరెస్టింగ్ లుక్ లో సత్యదేవ్ ఈ మూవీలో కనిపిస్తూ ఉండటం విశేషం. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. సత్యదేవ్ కెరియర్ లో మొదటి సారి పూర్తి స్థాయిలో కామెడీతో ఈ సినిమాని చేస్తుండటం విశేషం. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మంచి పెర్ఫార్మర్ అని పేరు తెచ్చుకున్న సత్యదేవ్ ఈ సినిమాతో కామెడీ హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి. ఈ మూవీ కాకినాడ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథగా ఉంటుందని టాక్.