Health University: విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మారుస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఈ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ అంశంపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎదుట, ఎన్టీఆర్ విగ్రహాల వద్ద భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మేధావి వర్గం, సొంత పార్టీ నుంచి కూడా ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండించారు.
అనేక విమర్శలు వచ్చినా జగన్ సర్కార్ దీనిపై వెనకడుగు వేయలేదు. ఏపీలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్ పేరును తొలగించడం బాధ కలిగిందన్న ఆయన.. వైఎస్సార్ వైద్య రంగానికి ఎంతో సేవ చేశారని, జగన్ ప్రభుత్వంపై తనకు వ్యతిరేకత ఏమీ లేదని వివరణ ఇచ్చారు. మరోవైపు ఈ అంశంపై ఎన్టీఆర్ మనవడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ జనాదరణ పొందిన గొప్ప నాయకులని అభివర్ణించిన జూనియర్ ఎన్టీఆర్.. ఇలా ఒకరి పేరు తొలగించి మరొకరి పేరు పెట్టడం వల్ల ఎన్టీఆర్ కు వచ్చే నష్టంగానీ, వైఎస్సార్ కు వచ్చే కీర్తి గానీ ఏమీ ఉండదని చెప్పాడు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా సీఎం జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్టీఆర్ పేరును తొలగించడం హేయమైన చర్యగా చెప్పారు.
Health University: గవర్నర్ ఆమోదం.. దీనిపై ముందుకే..
తాజాగా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఈ ఫైల్ పై సంతకం కూడా చేసేశారు. ఇకమీదట డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా ఈ విశ్వవిద్యాలయం కొనసాగనుంది. అసెంబ్లీలో ప్రకటించడం మొదలు.. గెజిట్ విడుదల చేయడం, జగన్ స్పీచ్.. ప్రతిపక్షం ఆందోళన ఇలా డ్రమాటిక్ గా ఈ వ్యవహారం నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతామని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు.