Team India: టీ20 ప్రపంచకప్‌లో సాఫీగా సాగుతున్న టీమిండియా ప్రయాణం ఒక్కసారిగా కష్టతరంగా మారింది. ఒక్క ఓటమి టీమిండియాలోని ఎన్నో లోపాలను బహిర్గతం చేసింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలవడంతో టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ గెలుపుతో గ్రూప్-2లో పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు టాప్‌లో కొనసాగిన టీమిండియా రెండో స్థానానికి పరిమితమైంది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఖాతాలో 5 పాయింట్లు ఉన్నాయి. జింబాబ్వేతో మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్, బంగ్లాదేశ్, టీమిండియా జట్లపై విజయం సాధించడంతో నాలుగు పాయింట్లు వచ్చాయి. మరోవైపు టీమిండియా ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లపై గెలిచిన భారత్ సఫారీలపై మాత్రం ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో జింబాబ్వే (3 పాయింట్లు), నాలుగో స్థానంలో బంగ్లాదేశ్ (2 పాయింట్లు), ఐదో స్థానంలో పాకిస్థాన్ (2 పాయింట్లు), ఆరో స్థానంలో నెదర్లాండ్స్ (0 పాయింట్లు) కొనసాగుతున్నాయి.
అయితే దాదాపు అన్ని జట్లు ఇంకా రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టీమిండియా తన తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే సెమీస్ బెర్త్ ఖాయం అవుతుంది. జింబాబ్వే, బంగ్లాదేశ్‌లలో ఎవరిని తక్కువ అంచనా వేసినా భారత్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయితే టీమిండియా మెగా టోర్నీ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాకు సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి.
Team India:
రెండో జట్టుగా పాకిస్థాన్ లేదా టీమిండియా లేదా జింబాబ్వేలకు అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై తప్పనిసరిగా గెలవాలి. ఈ రెండు మ్యాచ్‌లలో ఏ మ్యాచ్ ఓడినా పాకిస్థాన్ అవకాశాలు సన్నగిల్లుతాయి. దక్షిణాఫ్రికా జట్టు పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లతో ఆడాల్సి ఉంది. వీటిలో ఒక మ్యాచ్ ఓడినా దక్షిణాఫ్రికాకు ఎలాంటి నష్టం ఉండదు. కాబట్టి ఆ జట్టు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశాలున్నాయి.