Virat Kohli: ఆసియా కప్ నుంచి టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తిరిగి తన ఫామ్ కనపరుస్తున్నాడు. సెంచరీతో బౌన్స్ బ్యాక్ అయిన కోహ్లీ మళ్లీ రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో వెయ్యి పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ చేసింది 12 పరుగులే అయినా.. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ రికార్డు సాధించాడు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 22 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 80కి పైగా సగటుతో1001 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒకవేళ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 28 పరుగులు చేసి ఉంటే శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు బద్దలయ్యేది. టీ20 వరల్డ్‌కప్‌లో మొత్తం 31 మ్యాచ్‌లు ఆడిన జయవర్ధనే 1016 పరుగులు చేశాడు. అంటే జయవర్ధనే రికార్డును అందుకోవడానికి కోహ్లీ మరో 15 పరుగుల దూరంలో ఉన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నిరాశపర్చిన కోహ్లీ అంతకుముందు పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో అర్థశతకాలతో అదరగొట్టాడు. పాకిస్థాన్‌పై 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన అతడు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆసియాకప్ 2022 ముందు వరకు పేలవ ఫామ్‌తో సతమతమైన విరాట్ కోహ్లీకి నెల రోజుల సుదీర్ఘ విరామం కలిసొచ్చింది. ఈ విరామం అనంతరం పాత కోహ్లీలా చెలరేగుతున్నాడు.
Virat Kohli:
కాగా ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. జయవర్ధనే, కోహ్లీ తర్వాత విండీస్ వీరుడు క్రిస్ గేల్.. 33 మ్యాచ్‌లు ఆడి 31 ఇన్నింగ్స్‌ల ద్వారా 965 పరుగులు చేశాడు. వీటిలో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ 35 మ్యాచ్‌లు ఆడి 32 ఇన్నింగ్స్‌ల ద్వారా 904 పరుగులు చేశాడు. వీటిలో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ తర్వాతి స్థానంలో శ్రీలంక ఆటగాడు దిల్షాన్ ఉన్నాడు. దిల్షాన్ 35 మ్యాచ్‌లలో 34 ఇన్నింగ్స్‌లు ఆడి 897 పరుగులు సాధించాడు.