CM KCR: మునుగోడు ఉపఎన్నికకు సమయం ఆసన్నమవుతోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ చండూరు వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో సీఎం కేసీఆర్ బీజేపీ సర్కార్‌తో పాటు ప్రధాని మోదీ చెడుగుడు ఆడేశారు. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. కానీ కేసీఆర్ ఆసక్తికరంగా ఆ నలుగురిని సభా వేదికపైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై ఘాటుగా స్పందించారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని వంద కోట్లకు కొనేందుకు కొందరు ఢిల్లీ బ్రోకర్ గాళ్లు వచ్చారంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు.అమ్ముడు పోయేది తెలంగాణ కాదని ఆ నలుగురూ చెప్పుతో కొట్టినట్టు చెప్పారన్నారు. అంగల్లో పశువుల్లా అమ్ముడు పోకుండా తెలంగాణ, జాతి గౌరవాన్ని కాపాడారని ఆ నలుగురు ఎమ్మెల్యేలపై ప్రశంసల జల్లు కురిపించారు.14 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టిన బీజేపీకి వ్యవసాయ రంగానికి నిధులివ్వడం చేతకాదా? అని ప్రశ్నించారు. వడ్లు కొనమంటే నూకలు తీనాలన్న వారికి ఎన్నికల్లో తోకలు కత్తిరించాలన్నారు.
వడ్లు కొనడం చేతకానివారు ఎమ్మెల్యేలను కొనేందుకు మాత్రం వంద కోట్లతో ముందుకొచ్చారని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. అసలు ఆ వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. అసలు ఈ మొత్తం వ్యవహరాం వెనుక ఎవరున్నారో తేలాలన్నారు. రెండు సార్లు ప్రధానిగా చేసి కూడా అరాచకాలను ఎలా ప్రోత్సహిస్తున్నారంటూ మోదీపై కేసీఆర్ మండిపడ్డారు. తలకుమాసినోడు ఒకడొచ్చి తడిబట్టలతో ప్రమాణం చేస్తావా అంటాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సైతం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ బ్రోకర్లు చంచల్‌గూడ జైల్లో ఉన్నారని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో అన్నీ బయటపడతాయని కేసీఆర్ పేర్కొన్నారు.