T20 World Cup: టీ20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను టీమిండియా ఓడించిన తీరు అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. చివరి బాల్ వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరకు 4 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా 90 వేల మంది వీక్షిస్తే పరోక్షంగా టీవీలలో కోట్లాది మంది వీక్షించారు. దీంతో టీఆర్పీ రేటింగులు అమాంతం పెరిగిపోయాయి. అయితే మరోసారి ఈ ప్రపంచకప్‌లోనే భారత్, పాకిస్థాన్ తలపడాలని ఇరుదేశాల అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే ఈ ప్రపంచకప్‌లో దాయాది దేశాలు మరోసారి పోటీ పడే అవకాశం కేవలం ఫైనల్‌లోనే ఉంది. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్-2లో ఉన్నాయి. ఇదే గ్రూప్‌లో దక్షిణాఫ్రికా కూడా ఉంది. ఈ జట్టును దాయాది దేశాలు ఓడిస్తే ఈ రెండూ సెమీస్‌కు వెళ్లనున్నాయి. సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్-1 విజేతలతో తలపడనున్నాయి. గ్రూప్-1 విజేతలను భారత్, పాకిస్థాన్ ఓడిస్తే దాయాదుల పోరును మరోసారి వీక్షించే అవకాశం ఉంది.
ప్రస్తుతం టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్‌లలో రాణిస్తున్నాడు. రోహిత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ కూడా రాణిస్తే టీమిండియా విజృంభణకు అడ్డు ఉండదు. బౌలింగ్‌లో షమీ, భువనేశ్వర్, అర్ష్ దీప్ సింగ్, అశ్విన్ రాణిస్తే పాకిస్థాన్‌కు మరోసారి కష్టాలు తప్పకపోవచ్చు.
T20 World Cup:
కాగా ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ తలోసారి టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచాయి. 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలవడాన్ని ఇప్పటికీ అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. జోగిందర్ శర్మ బౌలింగ్‌లో మిస్బావుల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ను శ్రీశాంత్ పట్టుకోవడం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అలాంటి క్షణాలు మళ్లీ రావాలని భారత అభిమానులు మనసారా కోరుకుంటున్నారు. అటు 2009లో పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో దాయాది దేశాలు రెండోసారి విశ్వవిజేతగా నిలవాలని ఆరాటపడుతున్నాయి.