Telangana News : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బీజేపీయే తమను కొనుగోలు చేసేందుకు యత్నించిందని సదరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. దీనిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ఈ కుట్రకు రూపకల్పన అంతా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నప్పుడే జరిగిందని తెలిపారు. అసలు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక ఉన్నది కేసీఆరేనని బండి సంజయ్ పేర్కొన్నారు. హిందూ సమాజాన్ని కించపరిచేందుకు ఈ కుట్ర జరిగిందని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ మూడు రోజుల క్రితం ఈ కుట్రలో భాగంగానే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారన్నారు.
మొత్తానికి ఈ వ్యవహారం అంతా టీఆర్ఎస్ కుట్రేనని బండి సంజయ్ ఆరోపించారు. అటు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలు తమను కొనుగోలు చేసేందుకు యత్నించారని చెప్పడమే కాకుండా కేసు పెట్టారు. అయితే ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తరలించలేదని.. వారు నేరుగా ప్రగతి భవన్‌కు ఎలా వెళతారని బండి సంజయ్ మండిపడ్డారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎవరు కొంటారని.. అర్ధరూపాయికి కూడా పనికి రారంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా చూసుకునేందుకు ఈ నాటకాలు ఆడుతున్నారని.. కాబట్టి ఈ ఆరోపణలపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని బండి సంజయ్ కోరారు.
టీఆర్ఎస్ ఒక పెద్ద డ్రామా కంపెనీ అని.. అది ఆడే నాటకాలను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ఫామ్‌హౌస్‌లో ఉన్నవారు బీజేపీ వారని ఎవరు చెప్పారని.. అసలు అలా అనడానికి రుజువేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. బేరసారాలకు స్వామిజీలు వెళ్లడమేంటి? అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అని నిలదీశారు. ఇదంతా కేసీఆర్ కుట్రేనని కొట్టిపడేశారు. ఫామ్‌హౌస్ టీఆర్ఎస్ వాళ్లదేనని పైగా ఫిర్యాదు చేసింది కూడా వారేనన్నారు. కేసీఆర్ ఆడిన నాటకమంతా త్వరలోనే బయటపడుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో కూడా మంత్రిపై హత్యాయత్నం పేరుతో డ్రామాలు ఆడారని బండి సంజయ్ పేర్కొన్నారు.