దేవి కోసం ఆదిత్య, రుక్మిణిలు అన్ని చోట్లా వెతుకుతారు. అయినా పాప కనిపించదు. ఆ తర్వాత దేవుడమ్మ భర్తతో కలిసి మాధవ్ ఇంటికి వెళ్తుంది. జానకమ్మని ఓదార్చి ధైర్యం చెబుతుంది. అక్కడ మాధవ్ ప్రవర్తన మీద అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 26 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
సూరి, బాషాలు పట్టుకున్న ఆ వ్యక్తికి కడుపునిండా తిండి పెడతారు. కాసుల కోసం కక్కుర్తి పడి అడిగినంత పెడతారు. వాళ్ల డాడీకి ఫోన్ చేసి మాట్లాడి డబ్బులు తీసుకురమ్మంటారు. ఆ తర్వాత సీన్‌లో దేవుడమ్మ దేవి కనిపించాలని దేవుడిని ప్రార్థిస్తుంది. బిడ్డని క్షేమంగా చేర్చమని వేడుకుంటుంది. కొడుకుని సత్య అపార్థం చేసుకుంటుందని దేవుడి దగ్గర బాధపడుతుంది. ఆ తర్వాత మాధవ్ రాధ గురించి ఆలోచిస్తాడు. అపుడే భాగ్యమ్మ ఎంట్రీ ఇస్తుంది. ఏంటీ అని మాధవ్ అడగ్గా… ‘జర నాలుగు మాటలు చెప్తా. సోచాయించు’ అంటుంది భాగ్యమ్మ. చెప్పమని మాధవ్ అనగా.. ‘నీ చేతుల మీద పెంచిన బిడ్డ కనపడకుండా పోతే కంగారు లేకుండా కూర్చున్నావ్. అక్కడ నా బిడ్డ పరేషాన్ అవుతుంది. ఇదంతా చూస్తుంటే నాకు నీ మీదే అనుమానం కలుగుతుంది. నా బిడ్డను సతాయిస్తున్నావ్. నీ వాళ్ల మొఖం చూసి ఊరుకుంటున్నా. బిడ్డని నువ్వే మాయం చేసినవని నాకు అనుమానం రాకుండా ఎట్ల ఉంటది’ అని వార్నింగ్ ఇస్తుంది భాగ్యమ్మ.
భాగ్యమ్మ మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటాడు మాధవ్. ‘మంచిగ చెప్పింది విని నా మనవరాలిని తీసుకువచ్చి నా బిడ్డ చేతుల పెడితే మంచిగ ఉంటది. లేకపోతే నీ కథ ఏందో చెప్త బిడ్డ’ అంటూ హెచ్చరిస్తుంది మాధవ్‌ని. మాధవ్ మాత్రం కూల్‌గా అవునా.. నీ అనుమానం నిజం చేస్త. అపుడు ఏం చేస్తావో నేనూ చూస్తానని వెళ్లిపోతాడు అక్కడినుంచి.
సీన్ కట్ చేస్తే.. ఆదిత్య, రాధలు అనాథశ్రమాలన్నీ వెతుకుతారు. పెనిమిటీ ఎందుకు ఇక్కడ వెతుకుతున్నావని రాధ అడగ్గా.. నా బిడ్డని అనాథలా పెంచావ్ కదా అంటూ అరుస్తాడు ఆదిత్య. నీ వల్లే నా బిడ్డ దిక్కుదాని లాగ తిరుగుతుంది అంటూ బాధపడతాడు. నేను కడుపులో బిడ్డని పెట్టుకుని వచ్చింది నా చెల్లి కోసమే కాదు పెనిమిటి నీకోసం కూడా. మీ ప్రేమను గెలిపించాలనుకున్నా అంటూ ఎమోషనల్ అవుతుంది రాధ. నువ్ దాచిన నిజాలకు వాడు చెప్పిన అబద్ధాలకు నా బిడ్డ నలిగిపోతుందంటాడు ఆదిత్య. తప్పు ఎవరిది కాదు. ఆ పొద్దు నీళ్లల్లా నా పాణాలు కలిపి ఉంటే ఈ రోజు ఈ బాధ ఉండేది కాదంటుంది రుక్మిణి.
అంతలోనే ఓ వ్యక్తి వచ్చి పాప ఫొటో మళ్లీ చూపించమంటాడు. ఫొటో చూసి నిన్న రాత్రి ఈ పాపని జీపులో ఎక్కించి తీసుకెళ్లడం నేను చూశానంటాడు. ఏంటి నిజమా? అని షాకవుతారు ఆదిత్య, రుక్కులు. ఎటు వైపు వెళ్లారని అడగ్గా.. కొయ్యగూడెం వైపు వెళ్లారు. మీరు అటు వెళ్లి ప్రయత్నిస్తే బిడ్డ కచ్చితంగా దొరకవచ్చు అంటాడు ఆ వ్యక్తి. సరే సార్ అంటూ వెతకడానికి బయల్దేరతారు ఆదిత్య, రాధ.
ఆ తర్వాత దేవిని వెతికేందుకు సాయం చేయమని భర్తని, సూరిని వెళ్లమంటుంది దేవుడమ్మ. కన్నతండ్రి మాధవ్ ఏం చేస్తున్నాడు వెతకకుండా అని ప్రశ్నిస్తాడు ఈశ్వర ప్రసాద్. దాంతో మాధవ్‌కు ఫోన్ మాట్లాడుతుంది దేవుడమ్మ. ఇప్పటివరకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని నిలదీస్తుంది. బాధ్యత లేదా? అంటూ ప్రశ్నిస్తుంది. గొడవపడడమే కాదు ప్రేమ కూడా చూపించాలి అని హెచ్చరిస్తుంది. దేవిని తలుచుకుంటూ చిన్మయి, రామ్మూర్తి, జానకి, భాగ్యమ్మలు ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత చిన్మయి రాధకు ఫోన్ చేసి దేవి గురించి ఆరా తీస్తుంది. నువ్వేం బాధపడకు బిడ్డా.. అంటూ ధైర్యం చెబుతుంది చిన్మయికి. మరి దేవి దొరుకుతుందా లేదా తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..