దీపని చంపడానికి వాల్తేరు వాణి అనే లేడీ కిరాయి రౌడీని మాట్లాడుతుంది మోనిత. మోనితతో గొడవ ఉందని చెబుతూ దీపకి దగ్గర అవుతుంది వాణి. అంతేకాకుండా.. దీపని వదిన అంటూ వరుస కూడా కలిపేస్తుంది. దాంతో.. వాణి దుష్ట పన్నాగం తెలియని దీప ఆమెని పూర్తిగా నమ్మేస్తుంది. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని దుర్గ, దీప తినే టిఫిన్‌లో ఏదో కలుపుతుంది వాణి. ఇంతలో టిఫిన్ కావాలంటూ కార్తీక్ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 26న ఏం జరిగిందో చూద్దాం..
విషం కలిపిన టిఫిన్ తినడానికి రెడీగా ఉంటాడు కార్తీక్. దాంతో.. అతను తినకుండా ఆపడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది వాణి. ఇక ఆపే అవకాశం లేకపోవడంతో ఏం చేయలేక నిలబడి ఉండిపోతుంది. ఇంతలో కార్తీక్ టిఫిన్ తినబోతుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మోనిత.. కార్తీక్ చేతిలోని టిఫిన్ ప్లేట్‌ని లాక్కుని నేలకేసి కొడుతుంది. అది చూసి సంతోషపడిన వాణి కావాలనే మోనిత గొడవ పడినట్లు నటిస్తుంది. ఇద్దరు అక్కడే ఉన్న ఛైర్స్ లేపి కొట్టుకోడానికి సిద్ధమవుతారు. ఇంతలో మోనితని కార్తీక్, వాణిని దుర్గ ఆపడంతో ఆగిపోతారు. దాంతో.. ఇంకోసారి ఇక్కడికి వస్తే బాగోదు కార్తీక్ అంటూ అతన్ని లాక్కెళ్లిపోతుంది మోనిత. అది చూసి గండం గట్టేక్కిందని సంతోషపడుతుంది వాణి.
మరో వైపు.. బయటికి వెళ్లడానికి ఆటోని క్లీన్ చేస్తుంటాడు ఇంద్రుడు. అలాగే.. సౌర్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తనకంటే ముందే రెడీ అయ్యే సౌర్య ఇంకా రావట్లేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి చంద్రమ్మ వచ్చి.. సౌర్య పెద్దమనిషి అయిందనే విషయం చెబుతుంది. దాంతో.. ఇంద్రుడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. అనంతరం ముత్తదువుల్ని పిలవాలని చెప్పి.. సామాన్ల లిస్టు రాసి తీసుకురమ్మని ఇంద్రుడికి ఇస్తుంది చంద్రమ్మ. దాంతో ఆటో తీసుకుని సంతోషంగా బయటికి వెళతాడు ఇంద్రుడు.
ఇంకోవైపు.. అటు కార్తీక్, ఇటు దీప ఇద్దరు ఎవరింట్లో వారుండి సౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటారు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ అమ్మడానికి అదే ప్లేస్‌కి వచ్చే అవకాశం ఉందని అనుకుంటాడు. వారణాసి లేకపోవడంతో సౌర్యకి ఎవరు హెల్ప్ చేస్తున్నారని బాధ పడుతుంటాడు కార్తీక్. వీటన్నింటికి కారణమైన మోనితని ఏలాగైనా వదిలించుకోవాలని కార్తీక్ ఫిక్స్ అవుతాడు. అలాగే.. దీప కూడా మోనితతో గొడవ పడైనా తన భర్తని తాను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది.
అలాగే.. సమయానికి వెళ్లి విషం కలిపిన టిఫిన్ తినకుండా కార్తీక్ ని ఆపాను. కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఎంత ప్రమాదం జరిగిదేదని వాణిని తిట్టుకుంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్.. ప్రియమణి ఎవరని అడుగుతాడు. దాంతో.. గతంలో తన ఇంట్లో పని చేసిన ప్రియమణిని గుర్తు చేసుకుని కంగారు పడుతుంది మోనిత. దాంతో.. మనకి పెళ్లి కాలేదని ఆ ప్రియమణి అనే మహిళ చెప్పిందని, విషయాలన్ని తనే చెబుతాడు కార్తీక్. దాంతో.. ఆమె ఎవరో గుర్తు లేదని బుకాయించే ప్రయత్నం చేస్తుంది మోనిత. ప్రతి ప్రశ్నకి ఏదో సమాధానం చెబుతున్న మోనితకి.. నువ్వు అబద్ధం చెబుతున్నావని తెలిసిందో నాలో రాక్షసుడిని చూస్తావ్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు కార్తీక్. అది చూసి చాలా కంగారు పడుతుంది మోనిత.
ఇంకోవైపు.. దీప గురించి మాట్లాడుకుంటూ నడుస్తుంటారు దుర్గ, వాణి. దీప, కార్తీక్ అస్సలు భార్యాభర్తలని చెబుతాడు దుర్గ. దాంతో.. మోనిత ఏంటి కార్తీక్ తన భర్త అని చెప్పిందని అనుకుంటుంది వాణి. అయినా డబ్బులిచ్చింది కాబట్టి మోనిత చెప్పినట్లు పని పూర్తి చేసి వెళ్లిపోదామని ఫిక్స్ అవుతుంది. అలాగే వారి గురించి మాట్లాడుకుంటూ నడుస్తున్న వారిద్దరికి ఎదురుగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వస్తారు. దాంతో.. భయపడి దుర్గ ఓ వైపు, వాణి ఓ వైపు వెళ్లి దాక్కుంటారు. వారు వెళ్లిపోయినా తర్వాత ఎందుకు దాక్కున్నావని అడుగుతాడు దుర్గ. దానికి ‘నువ్వు దాక్కున్నావని నేను దాక్కున్నాను’ అని ఏదో కథ చెబుతుంది వాణి. కానీ నమ్మని దుర్గ ఏదో దాస్తోందని అనుకుంటాడు.
అక్కడ.. సౌర్యకి ఫంక్షన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది చంద్రమ్మ. ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రుడితో.. సౌర్య అమ్మనాన్నలా కాకపోయినా నార్మల్ గానైనా చేయాలని చెబుతుంది చంద్రమ్మ. దాంతో.. డబ్బుల కోసం బయటికి వెళతాడు ఇంద్రుడు. అప్పటికే సౌర్య కోసం ఆమె ఇంతకుముందు బొమ్మలు అమ్మిన చోట వెతుకుతుంటాడు కార్తీక్. అదే చోటికి ఇంద్రుడు కూడా వెళతాడు. వారిద్దరు కలిశారో లేదో తర్వాతి ఎపిసోడ్‌లో చూడండి.