మాధవ్‌కు ఫోన్ చేసి సత్య దేవి గురించి ఆరా తీస్తుంది. అక్కడ రాధ, ఆదిత్యలు దేవి జాడ కోసం ఊరంతా వెతుకుతారు. కానీ దేవి ఎక్కడా కనిపించదు. దేవిని వెతికేందుకని రుక్కు, ఆదిత్యలు ఒకే గదిలో ఉంటారు. మాధవ్ కూడా దేవిని వెతికే పనిలో ఉంటాడు. ఆ తర్వాత అక్టోబర్ 24 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఎవరి పాప కోసమో ఆదిత్య అంతగా తిరగాల్సిన అవసరం ఏముంది ఆంటీ అంటూ ప్రశ్నిస్తుంది సత్య దేవుడమ్మని. అంతా తెలిసి అలా మాట్లాడతావేంటి సత్య. ఇలా అడగడం పద్ధతిగా లేదు అంటుంది కోడలితో. సత్య అడిగిన ప్రశ్నలన్నింటికీ దేవుడమ్మ సమాధానం చెప్తుంది. కానీ ఆదిత్య వచ్చే వరకు భోజనం చేయనని వెళ్లిపోతుంది సత్య. ఆ రోజు రాత్రి రుక్మిణి, ఆదిత్యలు ఒకే గదిలో వేరువేరుగా పడుకుంటారు. గతాన్ని గుర్తుచేసుకుంటూ ఇద్దరూ ఎమోషనల్ అవుతారు. దేవమ్మ ఎట్ల ఉందో.. బిడ్డ తిన్నదో లేదో అనుకుంటూ ఏడుస్తుంది రుక్కు. ముందే జాగ్రత్త పడితే ఇలా జరిగేది కాదని కోప్పడతాడు ఆదిత్య. మాధవ్ చేసిన పనులని చెప్తూ ఆ పసి మనసు బాధపడి ఉంటుందంటాడు. ఆ ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించి దేవిని బాధపెట్టింది నువ్వే అంటాడు ఆదిత్య కోపంగా.
ఆ తర్వాత సీన్‌లో బాషా, సూరిలు హోటల్లో కనిపిస్తారు. పేపర్లో కనిపించిన ఓ ప్రకటన చూసి ఇద్దరూ ఆశ పడతారు. అందులో ఉన్న వ్యక్తి కనిపిస్తే 50 లక్షలు వస్తాయని కక్కుర్తి పడతారు. అదే హోటల్లో కనిపించిన ఆ వ్యక్తిని చూసిన సూరి ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే బాషా ఆ పేపర్ ముక్క తీసుకుని దగ్గర పెట్టుకుంటాడు. ఆ వ్యక్తిని పట్టిస్తే నాకు ఏం ఇస్తావ్ అని బాషా అడగ్గా.. ఇద్దరికీ సగం సగం అంటూ డీల్ కుదుర్చుకుంటారు. మరోవైపు రుక్మిణి ఆదిత్య మాటల్ని తలుచుకుంటూ కుమిలిపోతుంది. నువ్వే అర్థం చేసుకుంటావని అనుకున్న పెనిమిటి. కానీ నువ్ నన్ను అపార్థం చేసుకున్నావని బాధపడుతుంది. దేవికి ఆదిత్యే తన తండ్రని చెప్పకపోవడానికి గల కారణాలను గుర్తుచేసుకుంటుంది. అంతలోనే బయటినుంచి వెళ్తున్న ఒక పాప దేవి లాగే ఉందంటూ పరుగులు తీస్తుంది రుక్మిణి. వెనకాలే ఆదిత్య కూడా పరుగెత్తుతాడు. ఇలా పాప వెనక రుక్కు, రుక్కు వెనక ఆదిత్య పరుగెత్తుకుంటూ వెళ్తారు. కానీ చివరికి పాపని చూసిన రుక్కు.. పొరపాటు పడ్డామని అంటుంది. ఆదిత్య కూడా వాళ్లకి సారీ చెప్పి వెళ్లిపోతారు అక్కడినుంచి.
అక్కడ సూరీ, బాషాలు ప్రకటనలో కనిపించిన వ్యక్తిని పట్టుకుని ఓ చోటుకు తీసుకెళ్తారు. అతడిని గదిలో ఉంచి తాళం వేసి బయటకు వచ్చి పేపర్లో ఉన్న నెంబర్‌కి కాల్ చేస్తారు. కానీ ఆ ఫోన్ సూరీ వాళ్లు పట్టుకున్న వ్యక్తికే వస్తుంది. అమయాకంగా నటిస్తున్నన ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడతాడు. మీ అబ్బాయి మాకు దొరికాడంటూ సూరి చెప్పగా.. నేను వచ్చాక డబ్బులు కడతాను కానీ వాడికి నచ్చిన ఫుడ్ అంతా పెట్టండి అంటూ ఆర్డర్ వేస్తాడు లోపల ఉన్న వ్యక్తి. సూరి ఉంగరం అమ్మి మరీ తెప్పిస్తానంటాడు.
తర్వాత సీన్‌లో దేవి కనిపించకపోవడంతో రుక్కు బెంగపడుతుంది. మనం ఎవరికీ అన్యాయం చేయలేదు మనకూ ఆ దేవుడు అన్యాయం చేయడు బాధపడకు రుక్మిణి అంటూ ఓదారుస్తాడు ఆదిత్య. మరి దేవి దొరుకుతుందో లేదో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..