AUS v/s NZ: T20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు సిడ్నీలో ఘోర ఓటమి పాలైంది. సూపర్-12 దశలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి T20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు అస్ట్రేలియా జట్టుపై ఓడిపోయింది. ఇప్పుడు అదే ఆస్ట్రేలియా జట్టుపై ఆదిలోనే భారీ తేడాతో గెలుపొంది ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు రన్ రేట్ దారుణంగా పడిపోయింది.
న్యూజిలాండ్ జట్టు 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు ముందు ఉంచింది. లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్ళు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. 17.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయి దారుణ పరాజయాన్ని చవిచూశారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 3, మరో పేసర్ ట్రెంట్ బౌల్ట్ 2, ఫెర్గుసన్ 1, ఇష్ సోధీ 1 వికెట్ తీశారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో గ్లెన్ మాక్స్ వెల్ ఒక్కడే 28 పరుగులు చేశాడు. ఇతర ఆటగాళ్ళు తీవ్రంగా నిరాశపరిచారు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ 16 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మ్యాచ్ చివరి వరకు నిలిచి 58 బంతుల్లో 92 పరుగులు చేశాడు. కాన్వే ఖాతాలో 7 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజెల్ వుడ్ కు 2, జంపాకు ఓ వికెట్ దక్కాయి.
AUS v/s NZ:
భారీ స్కోరు దిశగా వెళ్తున్న న్యూజిలాండ్ జట్టును ఆస్ట్రేలియా బౌలర్లు ఏ మాత్రం నిలువరించలేకపోయారు. దీంతో 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఇది ఇలా ఉంటే 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు రన్ రేట్ -4.456 కు పడిపోయింది. ఈ మ్యాచ్ ద్వారా న్యూజిలాండ్ జట్టుకు రెండు పాయింట్లు లభించగా +4.456 రన్ రేట్ తో ముందుంది. తర్వాత జరిగే మ్యాచులలో ఆస్ట్రేలియా జట్టు భారీ తేడాతో గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.