Munugodu : తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో అన్ని పార్టీలు టాప్ లీడర్ల నుండి గల్లీ లీడర్ల వరకు మునుగోడుకు చేరుకొని.. పార్టీ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తుండగా.. కాంగ్రెస్ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. మునుగోడు విషయంలో కాంగ్రెస్ అన్నింటి కన్నా ఎక్కువ శ్రమించి, నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పరిస్థితి చూస్తే మాత్రం అలాంటిది కనిపించడం లేదు.
కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి మునుగోడు బరిలో నిలవగా.. ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ పెద్దలు ఎవరూ ప్రచారం చేయడం లేదు. తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు అందరూ ఆ యాత్రలో బిజీగా ఉన్నారు. దీంతో పాల్వాయి స్రవంతి ఒంటరిగా పార్టీ ప్రచారం చేస్తున్నారు.
ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ సీరియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను ప్రచారం చేసినా నాలుగు ఓట్లు పెరుగుతాయి తప్పితే కాంగ్రెస్ పార్టీ గెలవదని వ్యాఖ్యానించారు. రెండు అధికార పార్టీలు కొట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయగలం అని అన్న వెంకట్ రెడ్డి.. నేను రాజకీయాల్లో 25 ఏళ్లు ఉన్నాను. నాకు ఇక రాజకీయాలు చాలు అన్నారు.
Munugodu :
దీనిపై స్పందించిన పాల్వాయి స్రవంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సొంత అన్నలా భావించా అని, అయినా ఇలా వెన్నుపోటు పొడుస్తారని అస్సలు ఊహించలేదని పాల్వాయి స్రవంతి భావేద్వాగానికి గురయ్యారు. తాను ప్రచారానికి వస్తానని ముందు నుంచి ఆశీర్వదించి, వెనక నుండి వేరే వాళ్లు గెలవాలని కోరుకోవడం ఏంటని ఆమె అన్నారు.