Diwali: చీకటి వెలుగుల రంగేళిగా చెప్పుకొనే దీపావళి రోజు రానే వచ్చింది. దీపావళి పండుగంటే చాలా ఘనంగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఏ అంశంలోనూ రాజీ లేకుండా జరుపుకొనే పండుగ ఇది. సమయానికి నగదు చేతిలో లేకున్నాసరే.. అప్పు చేసి మరీ ఖర్చు పెట్టాలని భావిస్తుంటారు చాలా మంది. ఈ నేపథ్యంలో అనవసరమైన వాటికి కూడా అధికంగా ఖర్చు చేయడం మానుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేస్తే.. తర్వాత ఇబ్బందులు పడేది మీరేనంటూ జాగ్రత్తలు చెబుతున్నారు. తీరా డబ్బు అవసరమైన సందర్భాల్లో చేతిలో డబ్బులేక బిక్కమొహం వేయాల్సి వస్తుందంటున్నారు. దీపావళి నేపథ్యంలో అనవసర ఖర్చులను తగ్గించుకొని అవసరమైన వాటికి మాత్రమే వినియోగించుకోవాలని కొన్నిచిట్కాలు చెబుతున్నారు.
ముఖ్యంగా పండగపూట ఎక్కువగా ఖర్చు చేయకుండా పొదుపు చేయడం అవసరం. మనం కాస్త బడ్జెట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని దాటకుండా ప్లాన్ చేసుకోవాలి. వీలైతే ఏమేం కొనుక్కోవాలో లిస్టు రెడీ చేసుకుంటే ఇంకా బెటర్. తొలుత చాంతాడంత లిస్టు అవుతుంది. తర్వాత దాన్ని కాస్త ట్రిమ్ చేసి.. అనవసరమైన వాటిని తీసేస్తూ వస్తే బడ్జెట్ లో పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవచ్చు. ఉదాహరణకు ఈ పండుగ సామాన్యుల బడ్జెట్ ఓ పది వేల రూపాయల్లో అనుకుంటే అందులోనే మొత్తం పూర్తయ్యేలా ప్రణాళిక వేసుకోవాలి.
Diwali: నగదు లావాదేవీలే ముద్దు..
క్రెడిట్, డెబిట్ కార్డులు, ఫోన్ పే, జీ పే, యూపీఐ పేమెంట్లను చేయకపోవడం మంచిది. ఎందుకంటే అలా చేస్తూ పోతే కంటికి కనిపించకుండా చాలా ఖర్చు చేసేస్తారు. అందుకే ఓ పది వేలు చేతిలో పెట్టుకొని జాగ్రత్తగా వేటికి ఎంత ఖర్చు చేయాలో మన చేతుల మీదుగా చేసుకుంటే సరిపోతుంది. షాపింగ్ చేసే సమయాల్లోనూ డిస్కౌంట్లపై ఓ లుక్కేసి ఉంచితే కలిసి వస్తుంది. డబ్బు ఆదా అవుతుంది. స్వీట్లు ఇంట్లో తయారు చేసుకోవాలి. నగలు ఉన్నవే వేసుకుంటే బెటర్. నిత్యావసర సరుకులు పొదుపుగా వాడుకోవాలి. ఇలాంటి పద్ధతులు పాటిస్తే అధిక ఖర్చుకు చెక్ పెట్టి హాయిగా పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చు.