Diwali: తెలుగు పంచాంగం ప్రకారం అమావాస్య నాడు దీపావళి లక్ష్మి పూజ నిర్వహిస్తారు. దీపావళి నాడు ప్రదోష కాలంలో మహాలక్ష్మిని పూజించాలని నియమం ఉంది. విశ్వాసాల ప్రకారం ఈ పండుగ రోజున లక్ష్మి దర్శనమిస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందని ప్రతీతి ఉంది. దీపావళి నాడు ఇంటింటా దీపాలు వెలిగిస్తారు. చీకటి నుండి వెలుగులోకి పయనించడం ద్వారా అజ్ఞానాన్ని వీడి మనం జ్ఞానం వైపు వెళ్లడానికి ఈ పండుగ ప్రతీకగా నిలిస్తుంది. అయితే లక్ష్మీపూజలో కొన్ని వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. అవేంటో తెలుసుకుందాం.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా ఆమె పాదాలను పూజించాలి. మీరు బంగారం, వెండి లేదా లోహంతో చేసిన పాదాలతో పూజించవచ్చు. మీరు బంగారం, వెండితో చేసిన పాదాలను ఉంచుకోలేకపోతే మీరు లక్ష్మీదేవి పాదాలను కాగితంపై గీసి పూజించవచ్చు. అలాగే పూజలో శంఖానికి కూడా మంచి ప్రాముఖ్యత ఉంది. శంఖం లేకుండా లక్ష్మీపూజ అసంపూర్ణం. దక్షిణాభిముఖంగా ఉన్న శంఖాన్ని పూజించడం ద్వారా మీరు ఆనందం, శ్రేయస్సు పొందగలరు. అందుకే లక్ష్మీపూజ సమయంలో శంఖాన్ని సరైన దిశలో పూజిస్తే లక్ష్మి త్వరగా ప్రసన్నమవుతుంది.
నైవేద్యం:
పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి ఖీర్ సమర్పించండి. ఖీర్ లక్ష్మికి ఇష్టమైన స్వీట్ అనే నమ్మకం ఉంది. డ్రై ఫ్రూట్స్‌తో చేసిన ఖీర్‌ను అందించడం మరింత శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే లక్ష్మి ఇంట్లోకి ప్రవేశించాలంటే పరిశుభ్రత ముఖ్యం. ఇంటిని శుభ్రం చేయడంతో పాటు ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులు వేసి, ఇంటి ముందు రంగోలి వేసి దీపం వెలిగించాలి. అలాగే పూజలో తమలపాకును తప్పనిసరి. లక్ష్మీ పూజ చేసేటప్పుడు తమలపాకుపై స్వస్తిక్ గుర్తు వేయండి.
Diwali:
ఏనుగు లక్ష్మదేవి వాహనంగా కీర్తించబడింది. కాబట్టి లక్ష్మిని గజలక్ష్మి అని కూడా అంటారు. అందుకే ఏనుగుకు ప్రీతిపాత్రమైన చెరకును లక్ష్మీపూజలో వాడాలి. అలాగే శుభ్రమైన పాత్రలో ధనియాలను వేసి అమ్మవారి ముందు ఉంచాలి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ధనియాలు అదృష్టాన్ని చేకూరుస్తుందని పండితులు చెబుతుంటారు. అలాగే తామరపూవు కూడా పూజకు చాలా ముఖ్యం. అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ వస్తువులను ఉపయోగించి పండుగను శ్రేయస్కరంగా జరుపుకోండి.