దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో రాధకు మాధవ్ మీద అనుమానం కలుగుతుంది. దాంతో మాధవ్ గళ్ల పట్టి దేవిని ఏం చేశావని నిలదీస్తుంది. కానీ రాధ మీద ఒట్టు పెట్టి మరీ దేవి గురించి తనకేం తెలియదంటాడు మాధవ్. మరోవైపు సత్య ఎప్పటిలాగే ఆదిత్య, రుక్మిణిలను అనుమానిస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 21 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మాధవ్‌కు సత్య ఫోన్ చేసి దేవి కనిపించట్లేదట కదా నిజమేనా? అని ఆరా తీస్తుంది. మీ అమ్మాయి కనిపించట్లేదని అనగానే మా ఆదిత్య కంగారుగా వెళ్లిపోయాడంటుంది. అపుడు మాధవ్ సత్యను మరింత రెచ్చగొడతాడు. రాధ ఎపుడో వెళ్లింది.. ఆదిత్యతోనే కలిసి వెళ్లిందనుకుంటా అని నటిస్తాడు మాధవ్. ఫోన్ పెట్టేసిన తర్వాత సత్య రుక్మిణిని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత సీన్‌లో రుక్కు, ఆదిత్యలు కలుసుకుంటారు. నా కూతురిని ఏం చేద్దామనుకుంటున్నావ్.. ఇన్ని రోజుల నుంచి నా దగ్గరికి పంపిస్తా అని ఆ పని చేయలేకపోయావ్ అంటూ మొదటిసారిగా ఆదిత్య రాధ మీద మండిపడతాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి పాప కనిపించిందా అని అడుగుతాడు. స్పెషల్ టీంతో పాపను వెతికుతున్నామని చెప్తాడు. ఆ తర్వాత ఆదిత్య ‘అసలు దేవి ఇంట్లోనుంచి ఎందుకు వెళ్లిపోయింది. మాధవ్ మళ్లీ ఏమైనా అన్నాడా?’ అని నిలదీస్తాడు. అలాంటిదేం లేదని రాధ చెప్పగా.. ఏం లేకపోతే ఎందుకు వెళ్లిపోతుందని భార్య మీద అరిచి వెళ్లిపోతాడు ఆదిత్య.
దేవిని ముందుగా నేనే వెతికి పెట్టి ఇంకో నాటకమాడతా అనుకుంటాడు మాధవ్ మనసులో. అంతలోనే ఆదిత్య కారు రావడం కనిపిస్తుంది. ఇద్దరూ కలిసి దేవి గురించి పోట్లాడుకుంటారు. నా కూతురు కనిపించకోపోతే.. అంటూ కాలర్ పట్టుకుంటాడు ఆదిత్య. కానీ మాధవ్ మాత్రం దేవి నీ కూతురేంటి నా కూతురు అంటాడు. దేవికి ఏమైనా అయిందని తెలిస్తే నీ అంతు చూస్తానంటూ మాధవ్‌ని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత రాధ బిడ్డ కోసం ఊరంతా తిరుగుతూ అందర్నీ అడుగుతుంది. నన్ను వదిలిపెట్టి ఎందుకు పోయినవ్ బిడ్డా.. అనుకుంటూ ఏడుస్తుంది మనసులో. ఆదిత్య ఫోన్ చేసి దేవి కనిపించిందా అని అడుగుతాడు. ఈసారి దేవి కనిపించగానే నాతో పాటు నా ఇంటికి తీసుకెళ్తాను. ఇక నీ మాట వినేది లేదని తేల్చి చెప్తాడు ఆదిత్య.
ఆ తర్వాత సీన్‌లో దేవి మీద ఆదిత్య ఎందుకు అంత ప్రేమ పెంచుకున్నాడని అంటుంది దేవుడమ్మ రాజమ్మతో. దేవి కనిపించడం లేదనగానే కళ్ల నీళ్లు పెట్టుకునేలా ఉన్నాడు. ఈ మాటల్నీ సత్య విని కన్న బిడ్డలు కావాల్న ఆశ లేకుండా పరాయి బిడ్డ కోసం పాకులాడుతున్నాడని తిట్టుకుంటుంది మనసులో. అక్కడ ఆదిత్య, రాధ, పోలీసులు దేవి కోసం వెతుకుతూనే ఉంటారు. పాప ఇంకా కనిపించలేదా? పాప కలెక్టర్ గారి తాలూక. కేసు సీరియస్‌గా తీసుకోండని కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి చెప్తాడు సీనియర్ ఆఫీసర్. దేవిని వెతికి అలిసిపోయిన రాధ ఓ షాప్ దగ్గర ఆగిపోతుంది. ఆదిత్య సోడా తీసుకుని వచ్చి తాగమని ఇస్తాడు. దాహంతో ఉన్న రాధ తీసుకుని తాగేస్తుంది. దేవి కనిపించట్లేదని బాధపడుతుంది రాధ. ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది కద అంటాడు ఆదిత్య కోపంగా. వెళ్లిపోతున్న ఆదిత్యని పిలిచి పెనిమిటి నేనూ వస్తా.. ఇద్దరం కలిసి వెళ్దాం అంటే అవసరం లేదంటాడు ఆదిత్య. మళ్లీ ఆగిపపోయి రమ్మని పిలుస్తాడు. నేను నిన్ను రమ్మన్నది నీకోసం కాదు దేవి కోసం.. రేపు దేవి కనిపిస్తే నేనే తన తండ్రినని చెప్పాల్సిందే నువే కాబట్టి అంటాడు భార్యతో. ఆ మాటలకు రాధ హర్ట్ అవుతుంది. మాధవ్ వాళ్లిద్దర్నీ గమనిస్తూనే ఉంటాడు.
ఆ తర్వాత సీన్‌లో ఒంటరిగా కూర్చున్న సత్య దగ్గరికి వస్తుంది దేవుడమ్మ. ఎంత చెప్పినా మీరిద్దరూ మారరా? ఇలా తిండి, నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది అంటూ కోప్పడుతుంది. భోజనానికి రమ్మనగా మీరు వెళ్లండి నేను వచ్చి తింటానంటుంది సత్య. నేను పస్తులుంటే ఏం లాభం అని ఆలోచించి.. కోపంగా వెళ్లి అన్నం తింటుంది. అంతలోనే మాధవ్ నుంచి మెసేజ్ వస్తుంది. అతడు పంపిన ఆదిత్య, రాధల ఫోటోని చూసి షాకవుతుంది సత్య.