గాయత్రి జయంతి వేడుకలు జరుపుకోవడానికి తిలోత్తమ పర్మిషన్ ఇస్తుంది. దాంతో వల్లభ, కసిలు షాకవుతారు. వెంటనే తిలోత్తమ దగ్గరికి వెళ్లి ఒప్పుకోవడానికి కారణమేంటని అడుగుతారు. అపుడు తిలోత్తమ, నయనిల మధ్య జరిగిన కథంతా వివరిస్తుంది. మరోవైపు విశాల్, నయనిలు రొమాంటిక్ మూడ్‌లో ఉంటారు. ఆ తర్వాత అక్టోబర్ 19 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
నయనితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది తిలోత్తమ. సరే కానీ ఇపుడు సెలెబ్రేషన్స్ జరుగుతాయంటారా అని కసి అడగ్గా.. మమ్మీ చెప్పాక జరగకుండా ఉంటాయి అంటాడు వల్లభ. అపుడే జరగవు అంటుంది తిలోత్తమ. ఆ మాటతో మళ్లీ షాకవుతారు వాళ్లిద్దరూ. ‘అవును నా చేయి తిప్పిన నయని తల గిర్రున తిరిగేలా చేస్తా’ నని మాటిస్తుంది. ఎవరి చేయి అని అడగ్గా.. మీ నాన్న కాని నాన్న జగదీశ్ హ్యాండ్ విరిగిపోవాలి అంటుంది. అదెలా అమలు చేయాలో కూడా చెప్తానంటుంది తిలోత్తమ. ఆ తర్వాత సీన్‌లో సుమన గానవి అనుకుని గాయత్రికి ముద్దుపెడుతుంది. అది చూసి నిన్ను కాదు నీకు పాలిచ్చి పెంచిన మా నయని అక్కను అనాలి అనుకుంటుంది. అక్కా అని పిలుస్తూ వెళ్తుంది. నయని గానవిని ఎత్తుకుని జోల పాడుతుంది. అక్కా ఆ శాస్త్రిగారి మనవరాలు నా బెడ్ మీద ఎందుకు ఉందని ప్రశ్నిస్తుంది. ఉంటే ఏమయిందని నయని అంటుంది. అంతలోనే అందరూ అక్కడికి వస్తారు. విశాల్, విక్రాంత్‌లు సుమనని కోప్పడతాడు. నా కూతురిని కాకుండా ఎవరికో పుట్టిన ఆ గాయత్రిని నా పక్కన పడుకోపెడితే నాకెంత మండుతుంది అంటుంది సుమన. నాకేం అర్థం కావట్లేదని దురందర అనగా.. అర్థం కాకపోవడానికి ఏముంది ఆంటీ. నయని పసిబిడ్డల్ని మార్చిందని చెప్తుంది కసి. పేద పూజారి మనవరాలిని కూడా కోటీశ్వరుడిని చేయాలని ప్లాన్ చేసింది అంటాడు వల్లభ. సుమన కూతురిని నయని తీసుకుంది. సొంత చెల్లెలు కదా అని అలా చేసి ఉంటుంది అంటుంది కసి. అలా చేస్తే నేను ఊరుకుంటానా. పిల్లలు కావాలంటే కనాలి కానీ అని సుమన అంటే చెంప చెల్లుమనిపిస్తాడు విక్రాంత్. అపుడే సుమన కలలోనుంచి బయటికి వస్తుంది.
కల అన్నది మర్చిపోయి అదే గుర్తుచేసుకుంటూ బయటికి వస్తుంది సుమన. నిన్ను ఎవరు కొట్టారే అని దురందర అడగ్గా.. అందరి పేర్లు చెప్తుంది. అపుడే నయని వచ్చి ఎవరూ దండించలేదు. అనవసరంగా ఎందుకు నిందిస్తున్నావ్ అని ప్రశ్నించగా.. నా కూతుర్ని ఎత్తుకొచ్చి ఏమీ తెలియనట్లు భలే మాట్లాడుతున్నావ్ అక్క అంటుంది. నేను ఎత్తుకురావడం ఏంటని నయని ఆశ్చర్యపోతుంది. సుమన మాత్రం తనకు కలలో జరిగిందంతా చెప్తుంది. కానీ అక్కడున్న వాళ్లకు ఏం అర్థం కాదు. నా కూతుర్ని నాకు ఇచ్చేయండని అరుస్తూ గోల చేస్తుంది. దాంతో దురందరకు కోపం వచ్చి నీ గూబ నేనే గుయ్‌మనిపిస్తానని అంటుంది. నా బిడ్డని మా అక్కే మార్చేసింది అంటూ గొడవ చేస్తుంది. తెల్లవారేదాకా ఒళ్లు మరిచి పడుకుంటే ఇలాంటి పిచ్చి కలలే వస్తాయని క్లాస్ పీకుతుంది నయని. అయినా సుమన వినకుండా ఎందుకు మాట మారుస్తున్నావక్కా అంటూ నిలదీస్తుంది.
విశాల్ బాబు స్టాపిట్ అంటూ గొడవలోకి ఎంట్రీ ఇస్తాడు. పిల్లల్ని కనడమే కాదు హ్యాండిల్ చేయడం కూడా వచ్చంటూ హాసిని గానవిని తీసుకొస్తుంది. నీ కూతురునైనా నువ్ గుర్తుపడతావా సుమన అంటూ హాసిని ఎగతాళి చేస్తుంది. గానవిని చూసి సుమన షాకవుతుంది. ఇందాక నేను చూసినపుడు గాయత్రి కనిపించిందంటూ నసుగుతుంది సుమన. గానవిని తీసుకుని విక్రాంత్ లోపలికి వెళ్లిపోతాడు. అలా సుమన ప్రవర్తన అందరికి చిరాకు తెప్పిస్తుంది.
ఆ తర్వాత విక్రాంత్ విశాల్‌కి సారీ చెబుతాడు. బ్రో ల్యాప్ టాప్‌లో ఏదైనా చూశావా అందులో ఇంపార్టెంట్ డేటా కనిపించడం లేదని నసుగుతాడు విక్రాంత్. అపుడే సుమన వచ్చి అనుకున్న అమ్మాయిల ఫొటోలు ఏవో ఉన్నాయంటూ లొల్లి చేస్తుంది. పాస్వర్డ్ చెప్పమంటూ గోల చేస్తుంది. దాంతో నీ పేరే పెట్టుకున్నా అని చెప్పేస్తాడు విక్రాంత్. నీ మీద వాడికి ఉన్న ప్రేమ చూశావా సుమన. వాడితో గొడవ పెట్టుకోకు అని నచ్చచెప్తాడు. వీడియో గురించి విశాల్‌ని అడిగి క్లియర్‌గా తెలుసుకుని వెళ్లిపోతాడు విక్రాంత్. అక్కడ కసి నయనికి శిక్ష వేసే ప్లాన్ ఉందని చెబుతుంది వల్లభతో. కిచెన్ దగ్గరికి తీసుకెళ్లి నయనిని చూపిస్తుంది వల్లభకి. నయని క్లీన్ చేసి పెట్టిన పాల సీసాలో విషం కలుపుతుంది. దాంతో పాప చనిపోతుంది కాబట్టి పోలీసులు వచ్చి పాలిచ్చిన నయనిని అరెస్టు చేస్తారని చెబుతుంది వల్లభతో. కానీ వల్లభ మాత్రం భయపడతాడు. నువ్ కూల్‌గా ఉండంటూ ధైర్యం కూడా చెప్తుంది కసి.
ఆ తర్వాత ఇంట్లోకి నాగుపాము వస్తుంది. నయని విషం కలిపి పెట్టిన సీసాలో పాలు పట్టి తీసుకొచ్చి ఇస్తుంది. అదంతా చాటుగా గమనిస్తారు వల్లభ, కసిలు. ప్లాన్ వర్కౌట్ అయితే నయని జైలుకు వెళ్తుందని సంబరపడిపోతారు. నయని పాముతో మాట్లాడి గాయత్రి గురించి అడిగి తెలుసుకుంటుంది. మరి నాగుపాము ఏం చేస్తుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..