రుక్మిణి, ఆదిత్యలు ఎప్పటిలాగే రహస్యంగా కలుసుకుంటారు. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది సత్య. నాకెందుకు అన్యాయం చేస్తున్నారంటూ నిలదీస్తుంది. అపుడు ఆదిత్య తనలోని ఆవేదననంతా బయటపెడతాడు. అటు రుక్మిణి, ఇటు సత్య వల్ల తను నరకాన్ని అనుభవిస్తున్నానంటూ ఎమోషనల్ అవుతాడు. నాకెవ్వరూ వద్దని అక్కడినుంచి వెళ్లిపోతాడు. దాంతో రుక్కు, సత్యలు షాకవుతారు. ఆ తర్వాత అక్టోబర్ 19 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
సత్య కోసం ఇంట్లోని వారంతా వెతుకుతారు. తనకు చెప్పకుండా ఎప్పుడూ బయటకి వెళ్లేది కాదంటుంది దేవుడమ్మ. ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదంటాడు ఈశ్వర ప్రసాద్. అంతలోనే సత్య, ఆదిత్యలు ఒకేసారి వస్తారు. ‘ఎక్కడికెళ్లారు సత్య. అయినా ఇద్దరు కలిసి రాకుండా వేరు వేరుగా వస్తున్నారేంటి’ అని ప్రశ్నిస్తుంది రాజమ్మ. అసలు వీళ్లకేమైందో అర్థం కావట్లేదని భర్తతో చెప్పుకుంటూ బాధపడుతుంది దేవుడమ్మ. అక్కడ రుక్మిణి ఆదిత్య మాటల్ని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. భాగ్యమ్మ వచ్చి రుక్కును తాకగానే ‘అమ్మా’ అని కౌగిలించుకుని ఏడుపు లంకించుకుంటుంది. బిడ్డా ఏమైంది.. మాధవ్‌గాడు ఏమైనా అన్నాడా? అని అడగ్గా.. మాధవ్ కాదమ్మా.. నా పెనిమిటి అన్నాడు అంటుంది. పటేల్ నిన్ను అన్నాడా అని ఆశ్చర్యపోతుంది భాగ్యమ్మ. దాంతో అక్కడ జరిగిందంతా తల్లితో చెప్పుకుంటూ ఏడుస్తుంది రుక్కు. ఎప్పుడూ ఎవర్ని ఏమని పటేల్ అంత మాటన్నాడా అని బాధపడతుంది భాగ్యమ్మ. అందరూ నాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నారు అమ్మా అంటూ కంటతడి పెడుతుంది. నా బిడ్డని ఆ ఇంటికి ఇవ్వాలనుకోవడమే నా తప్పయింది. దేవి నేను చచ్చేదాకా నాతోనే ఉంటదనుకుంటూ వెళ్లుపోతుంది రుక్కు.
ఆ తర్వాత సీన్‌లో ఆదిత్య సత్యతో కాలేజీలో గడిపిన గుర్తుల్ని, పెళ్లయిన తర్వాత రుక్మిణితో గడిపిన గుర్తుల్ని నెమరువేసుకుంటూ బాధపడతాడు. అక్కా చెల్లెళ్లకు నేను ఫుట్ బాల్‌ని అయిపోయానని అనుకుంటాడు. అంతలోనే ఆఫీసర్ సారూ అన్న దేవి మాటల్ని గుర్తుచేసుకుంటూ మదనపడతాడు. ఆ తర్వాత రాధ దిగులుగా మెట్లు దిగి జానకి దగ్గరికి వస్తుంది. జానకి రాధకు సైగ చేసి నగలున్న లాకర్ చూపించి.. తీసుకుని వెళ్లిపోమంటుంది. దాంతో రాధ ఎమోషనల్ అయి జానకిని వాటేసుకుని ఏడుస్తుంది. నీ మంచి మనసుకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. మీకు మంచిగ అయ్యేదాకా మిమ్మల్ని విడిచిపెట్టి పోలేను. నేను లేకున్నా మాయమ్మ మీకు నయం అయ్యేదాకా చూసుకుంటదంటూ ఎమోషనల్ అవుతుంది రాధ. నా బిడ్డను మీ బిడ్డలాగ చూసుకున్నారు. ఆ రుణం ఇట్లన్న తీర్చుకుంటానంటుంది భాగ్యమ్మ. భాగ్యమ్మే తన తల్లని జానకికి పరిచయం చేస్తుంది రాధ. నగలు తీసుకుపొమ్మని జానకి సైగ చేయగా నా రెక్కల కష్టంతో బతుకుతా. ఏడున్నా చల్లగా ఉండమని ఆశీర్వదించమంటుంది రాధ. జానకి చేయి కదిలించి రాధ నెత్తిన పెట్టడంతో ఆశ్చర్యపోతుంది. సంతోషంగా కౌగిలించుకుంటుంది జానకిని.
సీన్ కట్ చేస్తే.. అక్కడ సత్య ఆదిత్య మాటల్ని తలుచుకుంటూ దుఖి:స్తుంది. దేవుడమ్మ వచ్చి ఏం జరిగిందని అడగను. నీ సమాధానం ఏమీ లేదని తెలుసు. కానీ ఒక్కటి గుర్తుంచుకో. చిత్తు కాగితాల్లా మీ జీవితాల్ని మీరే నలిపేసుకుంటున్నారంటూ హితబోధ చేస్తుంది. ఇది నీ జీవితం.. రుక్మిణి తన కష్టంతో నువ్ సుఖపడాలని తాపత్రయపడింది. తెలియక నేను పెళ్లి చేస్తే తన జీవితాన్నే త్యాగం చేసి వెళ్లిపోయిందంటూ గతాన్ని గుర్తుచేసుకుంటుంది దేవుడమ్మ. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తున్నాయంటే ప్రేమ ఎక్కువని అర్థమంటూ సూచిస్తుంది. గుడి వరకు వెళ్లొద్దాం రా అంటూ కోడల్ని పిలుస్తుంది.
అక్కడ చిన్మయి దేవి కోసం ఇల్లంతా వెతుకుతుంది. రాధ కంగారుపడుతుంది. ఏడికి పోయింది చూద్దాం పద అంటూ బయల్దేరుతుంది. దేవమ్మా.. అంటూ మళ్లీ ఇల్లంతా కలియతిరుగుతారు. ఎక్కడికి పోయుంటుంది రాధ అనగా.. అపుడు పోయినట్టు చెల్లి మళ్లీ ఇంట్లోనుంచి వెళ్లి పోయి ఉంటుందా అని చిన్మయి అనుమానం వ్యక్తం చేస్తుంది. దాంతో గత రాత్రి దేవి అడిగిన ప్రశ్నల్ని గుర్తుచేసుకుంటుంది రాధ. మరి దేవి మళ్లీ ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..