Kanna Lakshminarayana: విశాఖలో పెద్ద రచ్చే జరిగింది. ఈ ఒక్క ఘటన ఏపీలో రాజకీయంగా పలు మార్పులకు కారణమైంది. అనూహ్య పరిణామాలు చకచకా జరిగిపోయాయి. బీజేపీని ప్రతి ఒక్క సందర్భంలోనూ అంటి పెట్టుకుని ఉన్న పవన్‌కు ఆ పార్టీ చాలా నిరాదరణ చూపించింది.విశాఖలో అంత పెద్ద ఘటన జరిగినా కూడా కలిసి రాలేదు. దీంతో పవన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.బీజేపీ అంటే తనకు గౌరవమని.. అలాగని తన స్థాయిని దిగజార్చుకోలేనన్నారు.రౌడీలు రాజ్యమేలుతుంటే.. ప్రజలను రక్షించుకోవడానికి తాను తన వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుందన్నారు.
ప్రధాని మోదీ అంటే తనకు చాలా గౌరవమని.. అలాగని ఊడిగం చేయలేనన్నారు.అంతటితో ఆగారా? ఓ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీని ఏకి పారేశారు. ఆ వెంటనే విజయవాడలోని నోవాటెల్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. ఇకపై జనసేన, టీడీపీ కలిసి నడవనున్నాయి.ఇకపై బీజేపీతో కలిసి నడిచేది లేదన్న సంకేతాలను పరోక్షంగా పవన్ ఇచ్చేశారు. మరి బీజేపీ ఎందుకు పవన్‌ను నిర్లక్ష్యం చేసింది? తదితర విషయాలన్నీ ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు.
పవన్‌తో సఖ్యంగా ఉండటంలో బీజేపీ విఫలమైందని.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం పవన్‌తో సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని కన్నా పేర్కొన్నారు. అసలు ఈ సమస్యలన్నీ సోము వీర్రాజు వల్లేనన్నారు.సోము వీర్రాజు ఒక్కడే అయిపోవడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. ఇకనైనా హైకమాండ్ కల్పించుకుని రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అంతేకాకుండా రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై కన్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తమ పార్టీ నేతలతో సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.