Allu Aravind : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. తాజాగా తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పర్సనల్, ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సమస్యలు సవాళ్లు అన్నింటినీ వివరించారు. ఈ క్రమంలోనే 45 ఏళ్ల వయసులో తండ్రి చేతిలో తన్నులు తిన్న విషయాన్ని వివరించారు. అలాగే ఓ వ్యక్తిని చితకబాదిన విషయాన్ని వెల్లడించారు. చాలా సౌమ్యంగా కనిపించే అల్లు అరవింద్‌కు అంత కోపం ఎందుకు వచ్చింది? ఎందుకు ఒక వ్యక్తిని కొట్టాల్సి వచ్చింది? అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఏం చేశాడు? మైండ్‌లో చాలా డౌట్స్ గిర్రున తిరుగుతున్నాయి కదా.
అల్లు అరవింద్ ఒక ప్రొడక్షన్ మేనేజర్‌ను ఎందుకు కొట్టారట. అప్పట్లో చిరంజీవి డేట్స్ చూసేందుకు ఒక పెద్ద ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవారట. ప్రస్తుతం ఆయన చనిపోయారట. ఆయన మందు కొడితే మర్యాద మరచిపోయేవారట. చిరంజీవిని సైతం ఇష్టానురీతిగా అమర్యాదగా మాట్లాడేవారట. దీంతో అల్లు అరవింద్ ఒకటి రెండు సార్లు అది సరైన పద్ధతి కాదని చెప్పి చూశారట. వినిపించుకుంటేగా.. ఓ రోజు దేవీ థియేటర్‌లో తాను, చిరంజీవి, పలువురు పెద్దలంతా కలిసి ఓ సినిమా చూస్తున్నారట.
అప్పటికే ఆ సినిమా పలుమార్లు చూసి ఉండటంతో సినిమా చివరిలో అల్లు అరవింద్ లేచి బయటకు వచ్చారట. అప్పుడే అక్కడకు ఫుల్లుగా మందు తాగి సదరు ప్రొడక్షన్ మేనేజర్ వచ్చాడట. చిరంజీవిని పిలవమంటూ నానా రభస చేశాడట. నచ్చజెప్పి కారు ఎక్కించే ప్రయత్నం చేసినా వినలేదట. దీంతో అల్లు అరవింద్‌కి బీభత్సంగా కోపం వచ్చేసిందట. వెంటనే చేతికున్న వాచీ, కళ్లజోడు తీసి థియేటర్ మేనేజర్‌కిచ్చి ఆ ప్రొడక్షన్ మేనేజర్‌ని థియేటర్ నుంచి బయటకు లాక్కొచ్చి మరీ కుమ్మేశారట. దీంతో అతనికి 13 కుట్లు పడ్డాయట. చిరంజీవిని అలా అనేసరికి తట్టుకోలేకపోయానని ఆ తర్వాత పోలీసులు వచ్చి తనను అరెస్ట్ చేశారని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.