మాళవికతో యశోదర్‌ని అలా చూసి వేద ఫీల్ అవుతుంది. మాళవిక మీద మీకు ఇంకా ప్రేమ ఉంది కదా అని భర్తని నిలదీస్తుంది. అపుడు యశోదర్ నీకు నా మీద ప్రేమ ఉందా అని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ కాస్త చల్లబడుతుంది. మరోవైపు సులోచనకు మాళిని మాటలకు కోపం వస్తుంది. దాంతో తను మాట్లాడేస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 18 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
వేద యశోదర్ కారు తీసుకుని సర్వీసింగ్‌కి వెళ్తుంది. అక్కడ తను పెద్ద పెద్ద ఆక్సిడెంట్ చేసిన కార్లే నా దగ్గరికి వస్తాయి.. రండి శాంపిల్ చూపిస్తానంటూ తీసుకెళ్తాడు రిపేర్ చేసే వ్యక్తి. ఈ కారు ఎవరిదని వేద అడగ్గా.. వివరాలేమి గుర్తు లేవని అంటాడు. వేద కారు నెంబర్ తీసుకుని ఎవరి పేరు మీద ఉందో చెక్ చేస్తుంది. దాంతో ఆ కారు అభిమన్యుదేనని తేలిపోతుంది. వెంటనే వేద తన భర్తకు ఫోన్ చేస్తుంది. పరుగున వస్తాడు యశోదర్ అక్కడికి. వివరాలు తెలిసిపోయాయి కదా ఇక ఆ అభిమన్యు సంగతి నేను చూసుకుంటా నువ్ ఇంటికి వెళ్లు వేద అని భార్యని పంపిస్తాడు యశోదర్. ఆ తర్వాత సీన్‌లో వేద ఇంటికి వెళ్తుంది. తన అక్కకి ఫోన్ చేసి రమ్మని పిలుస్తుంది. సులోచన దగ్గరికి వెళ్లి ఆ దుర్మార్గుడు దొరికిపోయాడు. కారుకు ఆక్సిడెంట్ చేసిందెవరో తెలిసిపోయిందని చెప్తుంది.
సీన్ కట్ చేస్తే.. యశ్ మాళవిక ఇంటికి వెళ్తాడు. ఇక్కడికెందుకు వచ్చావ్ అని మాళవిక అడగ్గా.. నీ బండారం బయట పెడదామని వచ్చాను. ఆ రోజు ఏమన్నావ్.. ఫ్రూఫ్ ఉందా అని అడిగారు కదా.. ఇపుడు ఫ్రూఫ్స్‌తో వచ్చా.. ఎక్కడా ఆ అభిమన్యు అంటూ బెదిరిస్తాడు. నన్ను బెదిరిస్తున్నావా. నేను భయపడనని మాళవిక దబాయిస్తుంది. ‘నీ ముఖంలోని ఈ టెన్షనే చెప్తుంది. ఆక్సిడెంట్ చేసింది మీరేనని’ అంటాడు యశ్. మేము కాదు అంటూ మాళవిక తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కానీ యశోదర్ వివరాలన్నీ బయటపెట్టడంతో మాళవిక దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ పెద్దావిడ మీద పగ ఎలా తీర్చుకుంటావ్.. మా అత్తయ్యకు ఆ పరిస్థితి రావడానికి కారణమైన ఏ ఒక్కరినీ నేను వదిలిపెట్టను. ఇపుడే పోలీసులకు ఫోన్ చేస్తానంటూ కాల్ కలుపుతాడు. వద్దని మాళవిక బతిలాడుతుంది మాజీ భర్తని. దయచేసి నేను చెప్పేది విను యశ్. నీకు సగమే తెలుసు అంటుంది. మిగతా సగమేంటో చెప్పు మాళవిక అంటాడు యశ్.
ఆ ముసల్ది నీకు ఏమవుతది? కేవలం ఆ వేద ఖుషీకి ఆయ మాత్రమే అంటూ హేళన చేస్తుంది మాళవిక. నేను చెప్పేది వినమని మాళవిక ఎంత ప్రాధేయపడినా వినకుండా యశ్ పోలీసులకు ఫోన్ కలుపుతాడు. అభిమన్యు, కైలాష్‌లకు ఈ ఆక్సిడెంట్‌తో ఎలాంటి సంబంధం లేదని వాపోతుంది. మరి ఎవరు చేశారని నిలదీయగా చివరకు నేనే ఈ ఆక్సిడెంట్ చేశానని చెబుతుంది. అది విని యశ్ షాకవుతాడు. నేను నమ్మను అభిమన్యుని కాపాడడానికి నువ్ ఈ డ్రామా మొదలుపెడుతున్నావ్ కదా అంటాడు. లేదు నేనే ఆ కారు నడిపాను అభిమన్యు వాళ్లు నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. నన్ను కాపాడు ప్లీజ్ సొసైటీలో నా పరువు పోతుంది నన్ను కాపాడు ప్లీజ్ అంటూ యశోదర్‌ని వేడుకుంటుంది. అంతలోనే ఆది వచ్చి ఏమైంది మామ్.. ఈయన పోలీసులకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అంటూ ప్రశ్నిస్తాడు.
అక్కడ వేద తన అక్కబావలతో ఆక్సిడెంట్ చేసింది అభిమన్యునే అని అంటుంది. తనని ఎలాగైనా విడిచిపెట్టకూడదని అంటారు అందరూ. సరైన సాక్ష్యాలు దొరకక యశోదర్ ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నాడు. ఇపుడు ఆ అభిమన్యు అంతు చూస్తాడని నమ్మకంతో ఉంటుంది వేద. అక్కడ ఆది మాటలకు కరిగిపోతాడు యశ్. నా కోసం కాకపోయినా నా కొడుకు కోసమైనా నన్ను వదిలిపెట్టమని వేడుకుంటుంది మాళవిక. ఇది కావాలని చేసింది కాదు.. మిస్టేక్‌లో జరిగిందని సమర్థించుకుంటుంది మాళవిక. మా మమ్మీకి ఏం కాకుండా చూసుకుంటే మిమ్మల్ని నాన్నా అని పిలుస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తాడు ఆది. నువ్ కంగారుపడకు నీకు ఏం కాకుండా చూసుకుంటానని మాటిస్తాడు యశ్. ఆది మన కొడుకు నేను నిన్ను వాడికి దూరం చేయనని హామీ ఇస్తాడు భార్యకు. అక్కడ వేదేమో భర్త మీద పూర్తి భరోసాతో ఉంటుంది. మరి యశ్ ఏం చేస్తాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..