పొలం దగ్గరికి వెళ్లిన ఆదిత్యను, రాధని కలపాలనుకుంటుంది చిన్మయి. వాళ్లిద్దర్నీ అలా చూసి కుళ్లుకుంటాడు మాధవ్. సత్యని పిలిచి పొలం దగ్గర జరిగిందంతా చెప్తాడు. దాంతో సత్య కోపంతో రగిలిపోతుంది. మరోవైపు దేవుడమ్మ కొడుకు, కోడల్ని అలా చూసి ఆందోళన చెందుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 18 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
సత్య గురించి రాజమ్మకు చెప్పుకుంటూ బాధపడుతుంది దేవుడమ్మ. నీ మాటకు ఎదురు చెప్పని సత్య నీతో అలా మాట్లాడింది అంటే తను ఎంత బాధపడుతుందో కదా అంటుంది రాజమ్మ. భర్త ప్రేమ ఉంటే అత్త ఇంట్లో ఎంత కష్టం ఉన్నా ఆనందంగా ఉంటారు ఆడవాళ్లు అని మదనపడుతుంది దేవుడమ్మ. ఆదిత్య ఇంతకుముందు ఏది అడిగినా ప్రశాంతంగా చెప్పేవాడు కానీ ఇపుడు తప్పించుకుని వెళ్లిపోతున్నాడని బాధపడుతుంది. ఆ తర్వాత సత్య ఆదిత్య దగ్గరికి వెళ్లి.. ‘నేను అంతగా చెప్పినా నువ్ మళ్లీ మళ్లీ మా అక్కను ఎందుకు కలుస్తున్నావ్. నీకోసం మేమంతా ఉన్నాం కదా.. ఎంత చెప్పినా నువ్ మారవా’ అంటూ నిలదీస్తుంది. అయినా ఇపుడు ఏం జరిగింది. అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావ్ అని కోప్పడతాడు ఆదిత్య. ఇంకా ఏం తెలియాలి. ఊరి జనాలు ఏమనుకుంటారోనని ఆలోచించకుండా పొలం గట్టున కూర్చుని వాళ్లతో తినడం లేదా అని ప్రశ్నిస్తుంది సత్య. అంటే ప్రతి నిమిషం నా మీద నిఘా పెడుతున్నావా అంటూ సత్య మీద మండిపడతాడు ఆదిత్య. రుక్మిణి గురించి తెలిసి కూడా అనుమానిస్తున్నావా అంటూ గట్టిగా అరుస్తాడు ఆదిత్య. దాంతో దేవుడమ్మ వస్తుంది అక్కడకి. వచ్చి మాట్లాడుకోండి అంటూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత సత్య ఎందుకు ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావ్ అని అంటుంది.
సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ ఆదిత్య ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తుంది. ఇంతకు ముందులా లేడని.. మనసులో ఏదో ఉందని.. ఏం లేకపోతే సత్య ముందు తలదించుకుని ఎందుకలా ఉంటాడు.. ఎలా తెలుసుకోవాలని అనుకుంటుంది. మరోవైపు ఆదిత్య తన భార్య మాటల్ని తలుచుకుంటూ చింతిస్తాడు. చేయని తప్పుకు నిర్ధోషిలా తల దించుకోవాల్సి వస్తుందని మదనపడతాడు. అంతలోనే రుక్మిణి ఫోన్ చేస్తుంది. ‘దేవమ్మ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న. నాయన ఎవరు అని అడుగుతుంది. ఏదో ఒకటి చేయి పెనిమిటి’ అంటుంది భర్తతో. రేపు మనం డైరెక్ట్‌గా మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఆదిత్య.
మరుసటి రోజు ఉదయం ఆదిత్య, రుక్మిణిలు ఎప్పటిలాగే బయట కలుసుకుంటారు. ఏమైంది పెనిమిటి అట్ల ఉన్నావ్ అని రుక్క అడగ్గా.. ‘ఇద్దరి మధ్య నలిగిపోతున్నవాడిని. ఇట్ల కాకపోతే ఎట్ల ఉంటా. భార్య పిల్లలతో కలిసి బతికే అదృష్టం నాకు లేదంటూ’ ఎమోషనల్ అవుతాడు ఆదిత్య. నాకు ఎవ్వరూ వద్దు రుక్మిణి నేను ఒంటరిగా ఉంటానంటూ బాధపడతాడు. నా వల్ల ఎవరికీ మనశ్శాంతి లేదంటూ దుఖి:స్తాడు. అంతలోనే సత్య వస్తుంది అక్కడికి. ఇదేనా మీరు చేసే త్యాగం అంటూ అక్కని, భర్తని నిలదీస్తుంది. మిమ్మల్ని ఎలా నమ్మాలంటూ ఫైర్ అవుతుంది. ఇపుడేం చెప్తావ్ ఆదిత్య అంటూ రెచ్చగొడుతుంది. సత్యా.. అంటూ మండిపడతాడు భార్యమీద ఆదిత్య. నా జీవితాన్ని ఏం చేయాలనుకుంటురు, నాకు సమాధానం కావాలని డిమాండ్ చేస్తుంది సత్య. ‘నీ జీవితం, మీ అక్క జీవితం బాగానే ఉన్నాయి. కాలేజీలో నిన్ను ప్రేమించి, మీ అక్కను పెళ్లి చేసుకుని తప్పు చేశాను.’ అంటూ తన ఆవేదనంతా బయటపెడతాడు ఆదిత్య. అటు సత్య వల్ల అనుభవించిన బాధను, ఇటు రుక్మిణి వల్ల పడుతున్న బాధను చెప్పి ఇద్దర్నీ నిలదీస్తాడు. నాకు ఎవరితో ఉండాలని లేదు.. ఇప్పటికైనా ఒంటరిగా వదిలేయండి అని ఎమోషనల్ అవుతూ వెళ్లిపోతాడు ఆఫీసర్. ఆదిత్య మాటలకు షాకైన రుక్కు, సత్యలు కంటతడిపెడుతూ వెళ్లిపోతారు.
ఆ తర్వాత సీన్‌లో దేవుడమ్మ సత్య కోసం వెతుకుతుంది. రాజమ్మ, బాషాలను సత్య కనిపించిందా అని అడుగుతుంది. సత్య, ఆదిత్యలను అలా చూస్తుంటే చాలా బాధగా ఉందంటాడు ఈశ్వర ప్రసాద్. చిన్న పని మీద బయటకు వెళ్లినా సత్య తనకు చెప్పకుండా వెళ్లేది కాదంటారు బాషా, దేవుడమ్మలు. తరువాత ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..