Ali tho sardaga: ఇండస్ట్రీలోనే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఆయన తండ్రి, కుమారుల గురించి వరకూ మనకు తెలుసు కానీ అంతకు మించి విషయాలేమీ పెద్దగా మనకు తెలియవు.ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు కూడా.. అవునా.. మనకు ఇంత వరకూ తట్టలేదేంటి? అనిపిస్తుంది.అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరో కాబట్టి ఆయనకు సంబంధించిన విషయాల గురించి అభిమానులు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక ఆయన నిర్మాణ సంస్థ పేరు గీతా ఆర్ట్స్.
గీతా ఆర్ట్స్ ఎక్కడుంది అంటే అడ్రస్‌తో సహా చెప్పేస్తాం. కానీ గీతా ఆర్ట్స్‌లో ఆ గీత ఎవరంటే? చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.అయితే గీత అనగానే అల్లు అరవింద్ భార్య పేరు అయ్యుంటుందిలే అనుకునే వారు ఉన్నారు. మరికొందరైతే గీత అల్లు అరవింద్ గర్ల్ ఫ్రెండ్ పేరు అని అనుకున్నారట. అసలు గీత ఎవరనేది అల్లు అరవింద్ ‘అలీతో సరదాగా’ షోలో చెప్పుకొచ్చారు. గీత అంటే తన గర్ల్ ఫ్రెండ్ అనే డౌట్ చాలా మంది అభిప్రాయపడుతుంటారని.. అదైతే నిజమేనని.. తనకు గీత అనే గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఆమె పేరునే నిర్మాణ సంస్థకు పెట్టడం మాత్రం నిజం కాదన్నారు.
నిర్మాణ సంస్థకు గీతా ఆర్ట్స్ అనే పేరు పెట్టడమనేది తన తండ్రి అల్లు రామలింగయ్య ఛాయిస్ అన్నారు. ప్రయత్నం మనది.. ఫలితం మన చేతిలో లేదనేది గీతా సారాంశమని..అది నిర్మాణ సంస్థకు సరిగ్గా సరిపోతుందన్నారు. ఇది తన తండ్రి సూచించినందునే గీతా ఆర్ట్స్ అని పెట్టడం జరిగిందన్నారు. మరి పెళ్లి తర్వాత అయినా ఈ పేరు నిర్మల (అల్లు అరవింద్ భార్య) ఆర్ట్స్ అని మార్చాలనిపించలేదా? అని అలీ అడిగారు. దీనికి అల్లు అరవింద్.. అప్పటికే ఆ బ్యానర్‌పై చాలా సూపర్ హిట్స్ వచ్చాయని అందుకే మార్చే సాహసం చేయలేదన్నారు.