AP POLITICS: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఎమ్మెల్యే సీట్లను గెలిపించుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. మన దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత దగ్గర చేశారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఉపయోగకరమైన ఎన్నో కార్యక్రమాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రజలు ఎవరూ కూడా ప్రభుత్వాన్ని ఇది కావాలి అది కావాలి అని రోడ్లపైకి వచ్చిన దాఖాలాలు లేవు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సీపిఎస్ రద్దు విషయంలో రోడ్డెక్కారు. అది చేయడం సాధ్యం కాదని వైసీపీ తేల్చి చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసిందే..!

ఇక అసలు విషయంలో వస్తే ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల విషయంలో ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలు పోటీపోటీగా ఉద్యమాలు చేస్తూ వారి ప్రాంత గళాన్ని వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తర్వాత ఏపీకి రాజధానిగా అమరావతిని ప్రకటించింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాక్షిగా అమరావతి శంఖుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కూడా హాజరు కావడం జరిగింది.
అంతకు ముందు అసెంబ్లీలో టీడీపీ అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఏపీలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడటం ఇష్టం లేక అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నట్లు అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా నిర్ణయాలు తీసుకున్నారే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరి అప్పుడు ఇచ్చిన మాట జగన్ తప్పినట్లేగా అని మండిపడుతున్నారు.