Nandi idol: గుప్త నిధులు దొరుకుతాయనే ఆశతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల దుండగులు పురాతన ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో నిత్యం పూజించే దేవతా మూర్తుల విగ్రహాలు, గుడి ప్రాంగణాల్లో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాంటి ఘటనే తాజాగా వెలుగు చూసింది.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుప్త నిధుల కోసం నందీశ్వరుని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. గుప్త నిధుల వేటలో భాగంగా దుండగులు శివాలయంలో చేసిన చోరీ యత్నం విఫలమైంది. ప్రకాశం జిల్లా నాగులపాడు మండలంలోని కనపర్తి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అర్ధరాత్రి దాటాక దుండుగల పన్నాగం..
ఆదివారం అర్ధరాత్రి దాటాక దుండగులు నంది విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. పేలుడు పదార్థాలు అమర్ఛి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పూర్తిగా పెకలించేందుకు వీలు కాకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. రెండు కార్లలో వచ్చిన దుండగులు.. ఈ చోరీ యత్నం చేశారని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో మందుగుండు సామగ్రితో పేల్చినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయి.
Nandi idol:
నంది బొమ్మ దిగువన గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో దుండగులు ఈ దుశ్చర్యకు దిగి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం శివారాధనతో భక్తి పారవశ్యం పొందే ఆ ప్రాంతం ఇప్పుడు విలపిస్తోంది. శివయ్య ఎదుట కూర్చున్న నందీశ్వరుడు సగభాగం శరీరం ధ్వంసం అయిపోయి దీనంగా విలపిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. నంది విగ్రహాన్ని ఈ స్థితిలో చూసిన భక్తులు తల్లడిల్లిపోతున్నారు.