Sriram – Radha : తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్‌లు ఆదివారం అనూహ్యంగా భేటీ అయ్యారు. వీరి భేటీ రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. ప్రస్తుతం ఏపీలో అమరావతి రైతుల పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా అమరావతి రైతులు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దీనికి పరిటాల రవి, వంగవీటి రాధాలు మద్దతు తెలపనున్నారు. ఈ క్రమంలో నిన్ననే విజయవాడకు చేరుకున్న పరిటాల శ్రీరామ్.. వంగవీటి రాధాతో స్నేహపూర్వకంగా భేటీ అయ్యారు.
అటు వంగవీటి రంగా, పరిటాల రవి ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. అలాగే రాష్ట్రంలో ఈ రెండు కుటుంబాలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. అలాంటి వ్యక్తుల కుటుంబ వారసులు ఊహించని రీతిలో భేటీ అవడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడిచింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే..
అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనేందుకు వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్ కలిసి రాజమహేంద్రవరం వెళ్లారు. అక్కడ రాధా, శ్రీరామ్‌లు మరో యువనేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్‌తో కలిసి ఓ ప్రైవేటు ప్రాంతంలో సరదాగా సమావేశమయ్యారు.
మొత్తానికి ముగ్గురు వారసుల చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. అయితే గతంలో వంగవీటి రాధాను హత్య చేసేందుకు దుండగులు రెక్కీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిని తాజాగా పరిటాల శ్రీరామ్ ఖండించారు. వంగవీటి రాధా తెలుగుదేశం కుటుంబ సభ్యుడని శ్రీరామ్ స్పష్టం చేశారు. నేడు అమరావతి మహా పాదయాత్రలో ఇద్దరూ పాల్గొని మద్దతు తెలపనున్నారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర 36 రోజుల క్రితం కొవ్వూరు నుంచి సుప్రీంకోర్టు అనుమతితో ప్రారంభమైంది. నేడు ఈ పాదయాత్ర గామన్ వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోకి ప్రవేశించనుంది.