Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలం ముగిసింది. ఇంతకుముందు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పనిచేశారు. సాధారణంగా నాయకత్వ లక్షణాలున్న సౌరవ్ గంగూలీ తన కెరీర్ మొదటి నుంచి ఉన్నత స్థానాల్లోనే కొనసాగుతున్నాడు. టీమిండియా కెప్టెన్ గా జట్టును నడిపించిన దాదా క్రికెటర్ గా రిటైర్ అయిన తర్వాత కూడా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాడు.
తాజాగా రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపిక అవ్వకపోవడంపై బంధన్ బ్యాంకు ఈవెంట్లో దాదా స్పందించాడు. ఒక్కరోజులో ఎవరూ కూడా అంబానీ, నరేంద్ర మోడీలు కాలేరని, అదేవిధంగా శాశ్వతంగా ఎవరూ కూడా నాయకులుగా ఉండలేరని, మరో పెద్ద పనిని తాను చూసుకుంటున్నట్లుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక విషయానికొస్తే బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ నామినేషన్ వేయలేదు. అతడి స్థానంలో అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ నామినేషన్ వేశాడు. బీసీసీఐ ఏర్పాటైన మొదటి నుంచి ఏ ఒక్కరు కూడా వరుసగా రెండుసార్లు అధ్యక్ష పదవిలో కొనసాగలేదు. దీనికి తోడు ఏ రాష్ట్ర క్రికెట్ సంఘం మద్దతు కూడా గంగూలీకి లభించలేదు. దాంతో బోర్డు అధ్యక్ష పదవి నుండి సౌరవ్ గంగూలీ తప్పుకోవాల్సి వచ్చింది.
దీనిపై స్పందిస్తూ ‘నేను చాలా కాలంగా పాలకుడిగా ఉన్నాను. నేను ఇప్పటి నుంచి వేరే పని చూసుకోవాల్సి ఉంటుందని, టీమ్‌ఇండియాకు ఆడటమే నా జీవితంలో అత్యుత్తమమైన రోజులుగా చెప్పవచ్చని పేర్కొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా, క్రికెటర్ గా రెండింటిని నిర్వర్తించడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.
Sourav Ganguly:
‘ నేను చేసిన పరుగుల్ని మాత్రమే కాదు, మిగతా వాటినీ జనాలు గుర్తుంచుకోవాలి. ఒక నాయకుడిగా చేయాల్సింది ఇదే’ అని దాదా పేర్కొన్నాడు.