Rahul Koli: గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ ఇటీవల వార్తలకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. అయితే ఇది తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలిసి ఉండేది కాదేమో కానీ.. మన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సైతం విదేశీ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగం కోసం వెళ్లేందుకు ‘ది ఛెల్లో షో’తో పాటు పోటీ పడింది. కానీ చివరకు వాటిని చూసిన జ్యూరీ ఛెల్లో షోని ఎంపిక చేసింది. ఆస్కార్‌కి వెళ్లాలని.. ఏదో ఒక విభాగంలో అవార్డు సొంతం చేసుకోవాలని ఎవరికి అనిపించదు చెప్పండి. మన తెలుగు సినిమా వెళ్లిందంటే తెలుగు వారందరికీ గర్వకారణమే కదా. కానీ ‘ఆర్ఆర్ఆర్’ని తప్పించి జ్యూరీ ‘ఛెల్లో’ని ఎంపిక చేసిందనడంతో అంతా తీవ్రంగా నిరాశ చెందారు.
అలా తెలుగు వారందరికీ ‘ఛెల్లో షో’ గురించి బాగా తెలిసింది. ‘ఛెల్లో షో’ అంటే ఇంగ్లీష్‌లో లాస్ట్ షో అని అర్ధం. ఈ సినిమా కథ అంతా కొందరు చిన్నారుల చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఈ సినిమాలో చాలా మంది చిన్నారులు నటించారు. వారిలో ఒకడే రాహుల్ కోలీ. ఈ చిన్నారి ఈ నెల 2 వ తేదీన అహ్మదాబాద్‌లో క్యాన్సర్‌తో మరణించాడు. ఈ విషయాన్ని రాహుల్ తండ్రే స్వయంగా వెల్లడించాడు. అక్టోబర్ 2వ తేదీన ఉదయం టిఫిన్ చేశాడని.. ఆ తరువాత వెంటనే జ్వరం రావడం తగ్గిపోవడం జరిగిందని.. ఈ క్రమంలోనే రాహుల్ మూడు సార్లు రక్తపు వాంతులు చేసుకున్నాడని వెల్లడించారు.
ఆ తరువాత కాసేపటికే రాహుల్ మరణించాడని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన బిడ్డ లేడని.. తాము తమ బిడ్డను ఛెల్లో షోలో మాత్రమే చూసుకోగలమని వెల్లడించారు. ఛెల్లో షో సినిమాలో రాహుల్ కోలి రైల్వే సిగ్నల్ మ్యాన్ కుమారుడిగా నటించాడు. ప్రధాన పాత్రలో నటించిన సమయ్‌కు క్లోజ్ ఫ్రెండ్‌గా నటించాడు. 10 ఏళ్లకే రాహుల్ క్యాన్సర్‌తో మరణించడం అందరినీ కలచివేస్తోంది. క్యాన్సర్‌తో బాధపడుతూనే రాహుల్ ఛెల్లో షోలో నటించాడు. ఈ సినిమా అక్టోబర్ 14న విడుదల కానుంది. రాహుల్ తండ్రి ఆటో డ్రైవర్. ఈ సినిమాతో తమ జీవితాలే మారిపోతాయని తండ్రికి ధైర్యం చెప్పేవాడట రాహుల్ కోలి.