T20 World Cup: మరికొన్ని రోజుల్లో టీ-20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇక క్రికెట్ అంటేనే మతంగా వుండే భారత దేశంలో హై ఓల్టేజ్ ఫీవర్ పట్టుకుంది. క్రికెట్ విషయాలు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో వుంటున్నాయి. ప్రస్తుతం మన జట్టు ముందే ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ లను జనాలు విపరీతంగా ఆదరించారు. తర్వాత వన్డేల రాజ్యం నడిచింది. ప్రస్తుతం టీ-20 క్రికెట్ రోజులు నడుస్తున్నాయి. ఎందుకంటే ప్రేక్షకులు ప్రతి ఒక్కటీ స్పీడ్ గా కావాలని కోరుకుంటున్నారు. వారు కొరినట్లే బ్యాట్స్ మెన్ విజృంభించి పరుగుల వరద పారిస్తున్నారు.
ఇప్పటివరకు ఏడు వరల్డ్ కప్ లు వివిధ దేశాలలో జరిగాయి.. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా ఎనిమిదో వరల్డ్ కప్ జరగబోతోంది. వన్డే మ్యాచ్లో సెంచరీ చేస్తే గొప్పగా అనిపించే దగ్గర 20 ఓవర్ల లోనే సెంచరీ చేస్తే ఎలా ఉంటుంది. ఈరోజు అలాంటి యోధుల గురించి తెలుసుకుందాం. అసలు ఈ బాదుడు మొదలు పెట్టింది క్రిస్ గేల్. ఏ మాత్రం ఆశ్చర్యం లేకుండా ఆయనే టీ-20 ప్రపంచకప్ లో ఫస్ట్ సెంచరీ సాధించాడు. క్రిస్ గేల్ 2007లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్ లో 57 బంతుల్లోనే 117 పరుగులు చేశాడు.
సురేష్ రైనా కూడా 2010 లో దక్షిణాఫ్రికాపై 60 బంతుల్లో 101 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. అలాగే 2014 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ అలెక్స్ హేల్స్ శ్రీలంకపై జరిగిన మ్యాచ్ లో 64 బంతుల్లోనే 116 పరుగులు చేశాడు..పాకిస్థాన్ ఆటగాడు అహ్మద్ షాజాద్ కూడా 2014లో బంగ్లాదేశ్ పై 62 బాల్స్ లో 111 పరుగులు చేసి సెంచరీ కొట్టాడు. 2016 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ కూడా ఓమన్ పై జరిగిన మ్యాచ్ లో 63 బంతుల్లోనే 103 పరుగులుచేసి సెంచరీ క్లబ్ లో అడుగుపెట్టాడు.
T20 World Cup:
2010 టీ20 లో శ్రీలంక వెటరన్ బ్యాట్స్ మెన్ మహేల జయవర్దనే కూడా సెంచరీ కొట్టాడు. జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో అతడు 64 బంతుల్లోనే వంద పరుగులు సాధించాడు.అలాగే న్యూజిలాండ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ 2012 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లోసెంచరీ చేశాడు. అతడు.. 58 బంతుల్లోనే 123 పరుగులు చేశాడు. 2021 వరల్డ్ కప్ లో జాస్ బట్లర్ కూడా షార్జాలో జరిగిన మ్యాచులో 67 బంతుల్లో 101 పరుగుల తో సెంచరీ పూర్తి చేశాడు. కొసమెరుపు ఏమిటంటే టీ20 లో ఒక్క సెంచరీ కొట్టడమే ఎక్కువ అనుకుంటే మన బాదుడు బాస్ క్రిస్ గేల్ రెండు సెంచరీలు సాధించాడు. అతను 2016 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 48 బంతుల్లోనే సెంచరీ కొట్టి టీ20 లో తనకు తిరుగలేదని చాటాడు.