POLITICAL: ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ రాకీయాలు రసవత్తరంగానే సాగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో రాజధానికి అంశానికి సంబంధించిన వ్యవహారం కీలక చర్చ కొనసాగుతోంది. గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కూడా అమరావతిని రాజధాని నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రాంతా మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
2019 ఎన్నికల్లో అనూహ్యంగా అత్యధిక ఎమ్మెల్యే సీట్లను గెలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఎవరూ ఊహించని విధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కర్నూలును న్యాయ రాజధాని, విశాఖను అడ్మినిస్ట్రేషన్, ఇక శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు. దీంతో అసలు కథ మొదలైంది.

అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అక్కడి రైతులు పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓ నాన్ పొలిటికల్ జేఏసిని ఏర్పాటు చేసి అమరావతి రైతులకు ధీటుగా పాదయాత్ర చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇలా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో వారి వారి ప్రాంతం బాగు కోసం రోడ్లపైకి వచ్చి పోరాటం చేసేందుకు సిద్దం అయ్యారు.
ప్రస్తుతం రాయలసీమలో మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఉంది. ఇప్పటికీ ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాయలసీమకు మాత్రం న్యాయం జరగడం లేదనేది అక్షర సత్యం. రాయలసీమ ముఖ ద్వారం కర్నూలు ఒకప్పుడు రాజధానిగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే..! ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మూడు రాజధానులు, ఏకైక రాజధాని అమరావతితో ఒరిగిందేమీ లేదు. అందుకే ఏకంగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే అంతిమంగా ఈ ప్రాంత సమస్యకు పరిష్కార మార్గం అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ రాజధానుల వ్యవహారంతో ఏపీలో ఇంకా ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి..?!