T20 World Cup 2022: ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ అతి త్వరలో జరగబోతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా ఇప్పటికే ఆసీస్ కు చేరుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టు సభ్యులు అందరికంటే ముందే ఆతిథ్య దేశానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలెట్టారు. ఈనెల 16వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభమవుతోంది. మెగా టోర్నీలో ఆధిపత్యం సాధించాలని అన్ని జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి. భారత జట్టు తన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఈనెల 23న తలపడనుంది.
ఇప్పటి వరకు 7 సార్లు టీ20 వరల్డ్ కప్ జరిగింది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని టీమిండియా 2007లో జరిగిన ప్రపంచకప్ సొంతం చేసుకుంది. అయితే, ఈ టోర్నీ ఆరంభం నేపథ్యంలో పలు రికార్డులు బద్ధలు కాబోతున్నాయి. టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ఎవరు బద్ధలుకొడతారనేది ఆసక్తికరంగా మారింది. సిక్సర్ల విషయంలో ఎవరు ఎన్ని బాదారో తెలుసుకుందాం..
టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో యువరాజ్ సింగ్ టాప్ లో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ లో మొత్తం 31 మ్యాచ్ లు ఆడిన యువీ.. 33 సిక్సర్లు బాదాడు. ఇప్పటి వరకు ఇదే హయ్యస్ట్ రికార్డు. దీన్ని ఎవరు బద్ధలు కొడతారో వేచి చూడాల్సిందే. సిక్సర్ల విషయంలో రెండో స్థానంలో కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 33 మ్యాచ్ లలో 31 సిక్సర్లు బాదాడు. ఈ వరల్డ్ కప్ లోనే యువీ రికార్డును హిట్ మ్యాన్ బద్ధలు కొట్టే చాన్స్ ఉంది.
T20 World Cup 2022:
మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం.. విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ సిక్సర్ల విషయంలో మూడో స్థానంలో ఉన్నాడు. 21 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ.. 20 సిక్సులు కొట్టాడు. మొన్నటి దాకా పేలవ ఫామ్ లో కొనసాగిన విరాట్.. తాజాగా అఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టి బ్లాక్ బాస్టర్ ఇన్నింగ్స్ ఆడి తన ఫాం తిరిగి అందుకున్నాడు. పరుగుల వేటలో దాహంతో ఉన్న విరాట్ కూడా సిక్సర్లతో విరుచుకుపడే ప్రమాదం ఉంది. మరోవైపు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని విషయానికొస్తే.. 33 మ్యాచ్ లు ఆడి కేవలం 16 సిక్సర్లే కొట్టాడు. నాలుగో స్థానంలో ఉన్న ధోని రికార్డును సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య లాంటి వారు అధిగమించే అవకాశం ఉంది.