Manchu Lakshmi : టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లిపై కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు ఇది పుకారు అనడం కంటే నిజమేనేమో అనడం ఉత్తమం. దివంగత భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డితో ఇటీవల తరచూ మంచు మనోజ్ కనిపించడంతో ఈ వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇది చాలదన్నట్టు ఓ ప్రముఖ రాజకీయ నేత సైతం వీరిద్దరూ ఎప్పటి నుంచో రిలేషన్‌లో ఉన్నారని చెప్పి బాంబ్ పేల్చారు. వీరి పెళ్లికి ముందే లవ్‌లో ఉన్నారని.. పెళ్లికి భూమా నాగిరెడ్డి దంపతులు అంగీకరించకపోవడంతో వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారని చెప్పుకొచ్చాడు.
మంచు మనోజ్, మౌనిక ఇటీవలి కాలం వరకూ చెన్నైలో సహజీవనం చేశారని కూడా వార్తలొచ్చాయి. ఇక ఇటీవల వినాయక చవిత సందర్భంగా మనోజ్-మౌనికరెడ్డి కలిసి సీతాఫలమండిలోని వినాయక మండపానికి రావడంతో వీరి రిలేషన్‌కు సంబంధించిన వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అప్పటి నుంచి మనోజ్ రెండో పెళ్లిపై ఇటూ సినీ వర్గాలతో పాటు అటూ రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మనోజ్ రెండో పెళ్లి ఆయన సోదరి, నటి మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్య్వూలో మంచు మనోజ్ రెండో పెళ్లిపై స్పందించింది. ఎవరి బతుకు వారిని బతకనివ్వండి అంటూ లక్ష్మీ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. మనోజ్ మళ్లీ పెళ్లి చేసుకుంటే తనకూ ఆనందమేనని తెలిపింది. ఈ కాలంలో నిజాయితీ గల ప్రేమ దొరకడం చాలా కష్టమని.. అలాంటి ప్రేమను పొందాలంటే అదృష్టం ఉండాలని తెలిపింది. అయితే మనోజ్‌కు మాత్రం అలాంటి ప్రేమే దొరికిందని.. అందుకు తాను చాలా సంతోషిస్తున్నానని చెప్పుకొచ్చారు. తన ఆశీర్వాదం మనోజ్‌కు ఎప్పుడూ ఉంటుందని లక్ష్మి చెప్పుకొచ్చింది. మొత్తానికి లక్ష్మి తన వ్యాఖ్యలతో మనోజ్ రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్టైంది.