BIGG BOSS: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఏదో ఒక అంశం తెరపైకి రావడం, అది పెద్ద చర్చగా మారడం పరిపాటిగా మారింది. 2024 ఎన్నికలకు ఇప్పటి నుండే అన్ని రాజకీయ పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకొనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు మున్ముందు ఎవరు ఏ పార్టీలో జాయిన్ అవుతారో కూడా ఇప్పుడే చెప్పలేము.
మూడు రాజధానుల పేరుతో వైసీపీ రాష్ట్రంలో మైలేజ్ మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక టీడీపీ ఈసారి ఎలాగైనా పోగొట్టుకున్న అధికారాన్ని చేజిక్కించుకోవాలని తీవ్రంగా సన్నాహాలు చేసుకుంటోంది. ఇక తెలంగాణాలో మాదిరిగానే ఏపీలో కూడా బీజేపి ఉనికిని చాటుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే జనసేనతో ప్రస్తుతం పొత్తులో ఉంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ కెరీర్ పై చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతోంది.

గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సేవ కోసం ప్రజల్లో ఉన్న పవన్ కి తన మద్దతు ఉంటుందని తెలిపారు. దీంతో పాటు చిరు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, చిరంజీవితో భేటి ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు అన్ని గమనిస్తే చిరంజీవి రానున్న రోజుల్లో పొలిటికల్ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న చిరు రాజకీయాల్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరి తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీతో కలుస్తారా..? తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన కాంగ్రెస్ పార్టీకి పెద్దగా వ్యవహరించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా…? ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ వైపు ఏమైనా తొంగి చూస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి.