Racha Ravi : బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్న స్టార్స్ అంతా దసరాకు ఖరీదైన కార్లను కొనుగోలు చేసి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి సందడి చేశారు. తొలుత బిత్తిరి సత్తి ఫ్యామిలీతో కలిసి వెళ్లి లగ్జరీ కారును కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అనంతరం యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్.. ఆ తరువాత శివజ్యోతి తదితరులంతా తమ కొత్త కార్లతో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సందడి చేశారు. ఇక తాజాగా మరో బుల్లితెర నటుడు కూడా తన కొత్త కారుతో తీసుకున్న పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ నటుడు మరెవరో కాదు.. జబర్దస్త్ ద్వారా కమెడియన్‌గా తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన రచ్చ రవి. మనోడు కొనడానికి దసరా పండుగ రోజే కారు కొన్నా కూడా ఎందుకో మరీ కాస్తంత ఆలస్యంగా పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దసరా పండుగ సందర్భంగా కొత్త కారు కొన్నట్లు వెల్లడించాడు. ఇంతకీ ఏం కారు కొన్నాడు అంటారా? నెక్సా గ్రాండ్ వింటారా కారు. దీనిని కొనుగోలు చేసి దానితో దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా రచ్చ రవి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఇన్ని సంవత్సరాలు నాకు మద్దతుగా నిలుస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు’ అని రచ్చ రవి పోస్ట్ పెట్టాడు. అయితే రచ్చ రవి తన కారు విలువనైతే వెల్లడించలేదు కానీ ఈ కారు విలువ దాని ఫీచర్లను బట్టి దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రచ్చ రవి.. తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మంచి గుర్తింపును సాధించాడు. దీంతో మనోడికి కొన్ని సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.