Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి – గరికపాటి నర్సింహారావుల మధ్య జరిగిన చిన్న ఘటన చిలికి చిలికి గాలి వానగా మారిన విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఆ తరువాత నాగబాబే తిరిగి తామేమీ ఆయన నుంచి క్షమాపణలు వంటివి ఆశించడం లేదని చెప్పినా కూడా ఆగుతారా? పైగా ఇండస్ట్రీకి చెందిన కొందరు నటులు, సినిమాటోగ్రాఫర్స్ వంటి వారు ఓ రేంజ్‌లో రెచ్చిపోయి చిరంజీవిపై తమ స్వామి భక్తిని చాటారు. ఇక స్వయంగా మెగాస్టార్ ఎదుటే ఇష్టానుసారంగా వాడు, వీడు అంటూ గరికపాటిని మాట్లాడుతున్నా కూడా ఆయన మాత్రం స్పందించలేదు.
అయితే తాజాగా గరికపాటి ఓ ప్రకటన ద్వారా క్షమాపణలు వేడుకున్నారు. చిరంజీవి వంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గురించి తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. ఆ రోజు జరిగిన దానికి సిగ్గుతో తలవంచి మరీ ఆయనకు.. ఆయన అభిమానులకు క్షమాపణ కోరుతున్నానన్నారు. సహృదయంతో స్వీకరించాలని అభ్యర్థించారు. గరికపాటి అంతటి వ్యక్తి అంతలా దిగొచ్చి క్షమాపణ కోరితే కనీసం చిరు స్పందించను కూడా లేదు. సరే పోనీలే అనుకుంటే.. ఆయన అభిమానులు అంతలా రెచ్చిపోతున్నా కూడా స్పందించను కూడా లేదు.
ఇక తాజాగా సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు చిరంజీవిని ఆకాశానికి ఎత్తాడు. సరే స్వామి భక్తో లేదంటే.. ఇండస్ట్రీలో మనుగడ సాగించాలనుకుంటే ఎవరో ఒకరి భజన తప్పని సరి కాబట్టి చేశారని లైట్ తీసుకోవచ్చు. కానీ గరికపాటిని వాడు, వీడు అని మాట్లాడటమే ఇబ్బందికరంగా మారింది. వాడెవడో చిరుని తక్కువ చేసి మాట్లాడాడని.. మాట్లాడేవాడు మహాపండితుడు.. అలా మాట్లాడొచ్చా? అని మాట్లాడుతుంటే చిరంజీవి వింటూ ప్రశాంతంగా కూర్చోవడమేంటి? అంతకు ముందు గరికపాటిది తప్పే అనుకున్నా కూడా క్షమాపణ చెప్పారు కదా.. చెప్పిన తరువాత కూడా ఇలా మాట్లాడుతుంటే చిరు వింటూ కూర్చోవడం ఎంత వరకూ సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మాటలను ఖండించకుంటే అది ఎంకరేజ్ చేసినట్టేనని ఇంక ఆయన గరికపాటి నుంచి ఏం ఆశిస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటి వరకూ తప్పు గరికపాటిది అనుకున్నా కూడా ఇప్పుడు మాత్రం మెగాస్టార్‌దేనని అంటున్నారు.