Political: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే..! ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్రలో మూడు రాజధానుల అంశాన్ని సమర్ధిస్తూ ఏకంగా రాజీనామాల పర్వం మొదలైంది. రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా ఇప్పటికే జేఏసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీలో సభ్యులుగా ప్రొఫెసర్లు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు సహా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు.
శనివారం విశాఖపట్టణంలో ఈ జేఏసి సభ్యుల సమావేశం జరిగింది. అక్టోబర్ 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా ప్రకటనలతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం హీటెక్కింది. అధికార పార్టీకి చెందని నాయకులు పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ ఎలా కౌంటర్ ఇవ్వనుందో అనే దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

మరోవైపు తాము వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామాకు సిద్ధమని, రాజధాని అమరావతికి మద్దతుగా టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా అంటూ కరణం ధర్మశ్రీ సవాల్ విసిరారు. ప్రస్తుతం అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని, వారి సొంత ప్రయోజనాల కోసం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అంతే కాదు అమరావతి రైతుల పాదయాత్రకు ధీటుగా వికేంద్రీకరణ వాదనను వినిపిస్తూ మరో పాదయాత్ర ఏపీలో సాగాలని కూడా వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అయితే విశాఖ రాజధాని కోసం తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో రాజకీయం రసవత్తరంగా మారింది. మరి అమరావతి రైతులకు ధీటుగా వీరు కూడా పాదయాత్రను ప్రారంభిస్తే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి..!